హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఏర్పడిన అనుమానాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) స్పష్టత ఇచ్చింది. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, లక్షల మంది రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమేనని పేర్కొంది. జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష జరిగిందని, ఆ రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వివరాలు వెల్లడించామని తెలిపింది.
పారదర్శకత కోసం 2,33,248 మంది పరీక్ష రాసినట్లు మీడియాకు ప్రకటించామని పేర్కొంది. అయితే ఓఎంఆర్ స్కానింగ్‌లో మొత్తం 2,33,506 మంది పరీక్ష రాశారని తేలినట్లు తెలిపింది. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహించామని, అనేక జిల్లాల్లో లక్షల మంది రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమేనని కమిషన్ వివరించింది.
పరీక్ష తర్వాత పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. ఇదిలా ఉంటే, పరీక్ష జరిగిన 17 రోజుల తర్వాత అభ్యర్థుల సంఖ్య 258 పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్న పిటిషనర్ల వాదనను బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఏకీభవించింది. ఈనేపథ్యంలోనే టీఎస్‌పీఎస్‌సీ ఈ అంశంపై వివరణ ఇచ్చింది.