Monday, November 25, 2024

లాక్‌డౌన్ ఉండదు – ఆందోళన వద్దు..

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కొత్త కేసుల విస్తృతి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. కేసు పాజిటివిటీ రేటు ఇప్పటికే 25 శాతం దాటింది. అంటే టెస్టు చేయించుకుంటున్న ప్రతి నలుగురిలో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. 24 గంటల వ్యవధిలో 23 మరణాలు కూడా చోటుచేసుకున్నాయి. గత 8 నెలల కాలంలో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం సమావేశమైన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మంగళవారం మరికొన్ని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. దాదాపుగా లాక్‌డౌన్‌ను తలపించే ఆంక్షలే నగరంలో అమలవుతున్నప్పటికీ, లాక్‌డౌన్ ఉండబోదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ భయంతో దినసరి కూలీలు, కార్మికులు నగరాన్ని వీడి తమ స్వస్థలాలకు వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. కఠిన ఆంక్షలతో కోవిడ్ థర్డ్ వేవ్‌ను కట్టడి చేయాలన్న ఆలోచనలో ఆయనున్నారు. వారం రోజుల పాటు కేసుల ఉధృతి బాగా పెరుగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 75 వేల మార్కును చేరుకోగా, అందులో రెండొంతుల మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

బార్లు, రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలు బంద్.. ఉల్లంఘిస్తే కేసులు, కఠిన చర్యలు

కఠిన ఆంక్షలు తప్పవని ముందే హెచ్చరించిన ‘ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ)’, ఆ మేరకు ఇప్పటికే అమలవుతున్న ఆంక్షలకు అదనంగా మంగళవారం మరికొన్ని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేవలం పార్శిల్ సర్వీసులు (టేక్ అవే), ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కొనసాగించుకోవచ్చునని మినహాయింపునిచ్చింది. ఇకపోతే అత్యవసర, నిత్యావసర సేవల విభాగాలకు చెందిన శాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే మూసేసిన డీడీఎంఏ, తాజాగా నగరంలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ‘వర్క్ ఫ్రమ్ హోం (ఇంట్లోనే నుంచే పని)’ విధానంలో తమ తమ కార్యాకలాపాలు కొనసాగించుకోవాలని సూచించింది. అయితే డీడీఎంఏ గుర్తించిన మినహాయింపు జాబితాలోని ప్రైవేటు కార్యాలయాలకు మినహాయింపు ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. నగరంలో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వారాంతాల్లో కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement