తెలంగాణలో కరోనాను అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించబోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, వారాంతపు లాక్డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. లాక్డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంపై సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకున్నాయన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు