ఆంధ్రప్రభ, హైదరాబాద్: ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వార్తలు, మరోవైపు ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం శివరాత్రి, రెండో శనివారం, ఆదివారం మూడు రోజులపాటు ప్రభుత్వం ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. సచివాలయంతోపాటు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, తహశీల్దార్ కార్యాలయాలు మూడు రోజులు నిరంతరంగా పనిచేయనున్నాయి.
ఈ నెల 12 తర్వాత ఎప్పుడైన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2.45 లక్షల ధరణి పెండింగ్‌ల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెల 9వరకు షెడ్యూల్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందే ఫిక్స్ చేసిన నిర్ణయం కావడంతో ఈ మూడు రోజులూ తహశీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్లు తప్పనిసరిగా పనిచేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు పనిదినాలు, సెవలుల రద్దుపై ఉత్తర్వులు జారీ చేశాయి.