- ధాన్యం చెల్లింపులు రెండువారాల తరువాతే
- డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చెల్లింపులు పెండింగ్‌లోనే
- 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్
- ఇందులో కొనుగోలు చేసింది సగమే
- సకాలంలో డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్‌గా అమ్ముకుంటున్న వైనం
- అధికారుల మధ్య సమన్వయ లోపం… రైతులకు శాపం
- వానాకాలం సాగుకు పెట్టుబడుల కోసం రైతుల తంటాలు
(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించిన 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. రైతులు అమ్మిన ధాన్యానికి రెండువారాల తరువాత కూడా వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేపథ్యంలో రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సకాలంలో డబ్బులు వస్తాయనే నమ్మకంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవస్తే రెండు వారాల తరువాత కూడా చెల్లింపులు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం సేకరణ కూడా ఆశించినమేర జరగడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో సగం వరకే ధాన్యం సేకరించలేదు. వివిధ కారణాల నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు ప్రైవేట్‌గా ధాన్యం అమ్ముకుంటున్నారు. సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు.
రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఏ గ్రేడ్ రకానికి రూ.2060 చెల్లిస్తుండగా కామన్ రకానికి రూ. 2040 చెల్లిస్తున్నారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 176 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 36 కొనుగోలు కేంద్రాల ద్వారా 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు కూడా సేకరించలేదు. వికారాబాద్ జిల్లాలో ఏకంగా 1.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్ పెట్టుకోగా ఇందులో ఇప్పటివరకు కేవలం 63వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి 48 గంటల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ ఆదేశం అమలు కావడం లేదు. రెండు వారాలకు కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ధాన్యం అమ్మగానే డబ్బులు వస్తాయనే ఆశతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మారు. కానీ వారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కొందరు రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 4వేల మంది రైతులకు రూ. 37.67కోట్లమేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నెలరోజుల వ్యవధిలో రూ. 2కోట్ల చెల్లింపులు కూడా చేయలేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్ జిల్లాలో సేకరించిన ధాన్యానికి కేవలం 25 శాతం మేర మాత్రమే చెల్లింపులు చేశారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా తక్కువమేర చెల్లింపులు చేశారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం…
ధాన్యం చెల్లింపు విషయంలో అధికారుల మధ్య సరియైన సమన్వయం లేకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రౖౖెతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవచ్చిన తరువాత వాటికి తూకం వేయాలి. తరువాత రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. రైతు ఎంతమేర ధాన్యం తీసుకవచ్చాడు.. ఎన్ని డబ్బులు చెల్లించాలనే దానిపై నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ నమోదు విషయంలో అనుకున్నమేర వేగంగా ప్రక్రియ సాగడం లేదు. దీంతో రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించని పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అనుకున్న మేర వేగంగా పనులు సాగడం లేదు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ కావాలంటే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాలో సరియైన విధంగా సమన్వయం లేకపోవడంతో రైతులు వారాలపాటు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపులు ఆలస్యం కావడంతో చాలామంది రైతులు ప్రైవేట్‌గా ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు నేరుగా పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. రవాణా కర్చులతోపాటు సకాలంలో డబ్బులు వస్తుండటంతో చాలామంది రైతులు ప్రైవేట్‌గా ధాన్యం అమ్ముకుంటున్నారు.
వాకాకాలం పెట్టుబడుల కష్టాలు..
ధాన్యం అమ్మగా వచ్చే డబ్బులతో వానాకాలంలో పంటలు సాగు చేసేందుకు రైతులు పెట్టుబడుల కోసం వినియోగిస్తారు. దాంతోపాటు ఈనెలలో స్కూళ్లు, కాలేజీలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సుల కోసం వినియోగిస్తారు. కానీ రెండు వారాలుగా డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే వారంలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. దీంతో డబ్బుల కోసం రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. వర్షాలు ఆలస్యమయ్యాయి. లేకపోతే ఇప్పటికే వానాకాలం పంటల సాగు ప్రారంభమయ్యేది. సాగుకు ముందే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటి కర్చులకు కూడా డబ్బులు అవసరం. కానీ సకాలంలో ధాన్యం డబ్బులు రాకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ముగింపు దశకు కొనుగోళ్లు..
ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆలస్యంగా సాగు చేసిన రైతుల మినహా ముందుగా సాగు చేసిన రౖౖెతులు ఇప్పటికే ధాన్యం విక్రయాలు చేశారు. ఈ నెలాఖరు వరకు కొనుగోలు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. గతసారి మాదిరిగానే ఈసారి కూడా అనుకున్న మేర ధాన్యం సేకరించే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి సగం మేర ధాన్యం సేకరించలేకపోయారు. 20 రోజుల వ్యవధిలో సగం టార్గెట్ పూర్తి చేసే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ప్రతిసారి టార్గెట్ పెట్టుకోవడం అందులో సగానికి అటు ఇటుగా ధాన్యం సేకరించడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పరిధిలో ఎక్కువ ధాన్యం సేకరించాలని భావించినా అది సాధ్యమయ్యే పరిస్థితులు ఎంతమాత్రం కనిపించడం లేదు.