Friday, November 22, 2024

Big story | చదివేదెలా…రాసేదెలా..? పోటీ పరీక్షల మధ్య లేని గ్యాప్‌.. నష్టపోనున్న అభ్యర్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నోటిఫికేషన్లు లేకపోవడంతో ఇన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుద్యోగులు తీరా నోటిఫికేషన్లు పడి పరీక్షలు రాసే సమయంలో పరీక్షల మధ్య గ్యాప్‌ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరీక్షకు పరీక్షకు మధ్య సరైనా గ్యాప్‌ లేకుండా ఒకే నెలలో రెండు పోటీ పరీక్షలు..అది కూడా ఆరు రోజుల గ్యాప్‌తో మరో పరీక్ష నిర్వహిస్తుండటంతో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత పడక పడకా.. నోటిఫికేషన్లు పడితే ఆ ఉద్యోగాల కోసం ఎన్నో ఆశలతో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. అయితే పరీక్షకు పరీక్షు ఏమాత్రం గ్యాప్‌ లేకపోవడంతో ఏదోక పరీక్షను మాత్రమే రాయాల్సిన పరిస్థి ఏర్పడింది. దీంతో అభ్యర్థులు పరీక్ష మధ్య గ్యాప్‌ ఇచ్చి వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రూప్‌-2 పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

ఆగస్టు నెల మొదటి తేదీ నుండి 23వ తేదీ వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన టీజీటీ, పీజీటీ ఇతర పరీక్షలున్నాయి. ఒకే నెలలో అటు గ్రూప్‌-2 ఇటు గురుకుల పరీక్షల నిర్వహణ వల్ల అభ్యర్థులు ఏదోక పరీక్షకు మాత్రమే సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురుకుల పరీక్షలు అయిపోయిన కేవలం 6 రోజుల గ్యాప్‌తోనే గ్రూప్‌-2 అంటే.. ఆగస్టు 29, 30 తేదీల్లో రాయాల్సి ఉంది. రెండూ పరీక్షలకు ఒకేసారి సన్నద్ధం కాలేకపోతున్నామని అభ్యర్థులు అంటున్నారు. దీంతో 3 నెలలు గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ కోరుతున్నారు.

ఈమేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి దాదాపు 300 వరకు అభ్యర్థులు సోమవారం తరలివచ్చి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. పైగా గురుకుల సిలబస్‌, గ్రూప్‌-2 సిలబస్‌ వేర్వేరుగా ఉన్నందున ఒకే అభ్యర్థి రెండు పరీక్షల సిలబస్‌ను కవర్‌ చేయడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గురుకుల పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా అభ్యర్థులకు బోర్డు ప్రకటించింది. దీంతో గురుకుల పరీక్షలు ముగిసిన తర్వాత రెండు లేదా మూడు నెలలకు గ్రూప్‌-2 పరీక్షను నిర్వహించాలని వారు కోరుతున్నారు.

పేపర్‌ లీకేజీతో డిస్టర్బ్‌…

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను గతేడాది డిసెంబర్‌లోనే జారీ చేసింది. అయితే టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కారణంగా పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. లీకేజీ వ్యవహారంతో మానసికంగా అభ్యర్థులు కుంగిపోయి ఉన్నారు. దాదాపు మూడు నెలలు చదవలేకపోయామని అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు గ్రూప్‌-2 మూడవ పేపర్‌ ఎకానమీలో గత సిలబస్‌కు 70 శాతం అదనంగా చేర్చారు. దీంతో అతితక్కువ సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమవడం కష్టమంటున్నారు. గ్రూప్‌-2, గురుకుల పరీక్షలకు తమకు అర్హతలున్నా ఒకే నెలలో నిర్వహించడం వల్ల ఏదోక పరీక్షను రాసే అవకాశాన్ని కోల్పోతున్నామని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.

నష్టపోనున్న వేలాది మంది…

గ్రూప్‌-2 పరీక్షకు ఆరు రోజుల ముందు వరకు గురుకుల పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. ఏ పరీక్షకు ప్రిపేర్‌ కావాలో తెలియక అభ్యర్థులు సతమతవుతున్నారు. పలు వరుస నోటిఫికేషన్లు రాష్ట్రంలో పడడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు వరుస పరీక్షలతో సరిగా సన్నద్ధమవ్వని పరిస్థితి నెలకొంది. జూలై 1న జరిగిన గ్రూప్‌-4 పరీక్షకు మొన్నటి వరకు సన్నద్ధమైన అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్‌-2, గురుకుల, జేఎల్‌ పరీక్షలకు వెనువెంటనే సన్నద్ధమవ్వడం కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. గురుకుల పోస్టులకు బోర్డు ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేయగా, గ్రూప్‌-2ను డిసెంబర్‌లో జారీ చేశారు. గ్రూప్‌-2కు దాదాపు 5.5 లక్షల మంది, గురుకులకు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈరెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈక్రమంలో రెండూ పరీక్షలకు గ్యాప్‌ లేకపోవడంతో వాటిని దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement