Wednesday, November 20, 2024

కాంగ్రెస్‌తో దోస్తీ లేదు, బిల్లు మంచిదైతే మద్ధతు.. లేదంటే వ్యతిరేకిస్తాం: టీఆర్ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు వినడానికి అధికారపక్షం సిద్ధంగా లేదని, అందుకే సమావేశాల్లో రభస చోటుచేసుకుంటోందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు జరుగుతున్న అఖిలపక్ష సమావేశాలు ఓ తంతుగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అధికారపక్షం కోరడం, తాము కోరిన అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం, ఆ తర్వాత తీరా సమావేశాలు మొదలయ్యాక రభస, గందరగోళం చోటుచేసుకోవడం ప్రతిసారీ రివాజుగా మారిపోయిందని ఆయనన్నారు. వీటన్నింటికీ కారణం అధికారపక్షమేనని ఆయన నిందించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల స్వరం వినిపించుకోవడం లేదని, కనీసం వినేందుకు కూడా సిద్ధంగా లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు వినాలని, అప్పుడే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయని కేకే అన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల గొంతు వినడమని గుర్తుచేశారు. అధికారపక్షం తలపెట్టిన బిల్లులు పాస్ చేయడం మాత్రమే కాదు, ప్రజాసమస్యలపైనా చర్చ జరగాలని అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. అందుకే ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలు పురోగమనంలో ఉన్న రాష్ట్రాల పాలిట శాపంగా మారాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురవుతున్నాయని, దేశంలో అన్నింటికంటే ఎక్కువగా వివక్షకు గురవుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణాయేనని కేకే అన్నారు. తెలంగాణ ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు జీడీపీలో 3.5 శాతం రుణాలు తీసుకుంటుంటే, కేంద్రం మాత్రం ఏకంగా 6.2 శాతం అప్పు చేస్తోందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర బృందాలు తెలంగామలో 18సార్లు తనిఖీలు చేపట్టాయని, తద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

‘భాష’ విషయంలో కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని, కానీ అది ఉత్తర-దక్షిణ భారతదేశ విభజనకు కూడా దారితీసే ప్రమాదం ఉందని కే. కేశవరావు అన్నారు. భారతదేశం భిన్నత్వానికి ప్రతీక అని, దాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే పరిణామాలు ఊహకు అందవని హెచ్చరించారు. ‘అన్‌పార్లమెంటరీ’ పదాల విషయంలో సందర్భాన్ని చూడాలి తప్ప పదాల అర్థం చూడకూడదని హితవు పలికారు. ధర్నాలు, నిరసన ప్రదర్శనల విషయంలో ఇచ్చిన సర్క్యులర్ పై కేంద్రం వివరణ ఇచ్చిందని, ప్రతి సమావేశాల ముందు అలాంటి సర్క్యులర్లు జారీ చేయడం సహజమేనని చెప్పిందని కేకే అన్నారు. రాజ్యాంగ సంస్థల్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను వేధించడం, అణగదొక్కడం కోసం వినియోగిస్తున్నారని కేకే ఆరోపించారు. కులాలవారిగా జనగణన, నిరుద్యోగం, కులమతాల ఆధారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు తెలిపారు. అటవీ రక్షణ పేరుతో ఆదివాసీలు – గిరిజనుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోందని కేకే మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ప్రజా ఆస్తులను అమ్మేస్తోందని, ప్రైవేటీకరణ అనంతరం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా పోయాయని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో దక్షిణాదిని ఉత్తరాది నేతలు పరిపాలిస్తున్నారన్న అభిప్రాయం నెలకొందని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులిద్దరూ ఉత్తరాదివారే కావడం ఇందుకు నిదర్శనమని చాలామంది అభిప్రాయపడినట్టు కేకే వెల్లడించారు. తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని, అయితే కాంగ్రెస్ పార్టీతో మాత్రం తమకు దోస్తీ లేదని కేశవరావు తేల్చి చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు ప్రజలకు ఉపయోగపడేవి అని భావిస్తేనే మద్ధతిస్తామని, లేనిపక్షంలో వ్యతిరేకిస్తామని కేకే తెలిపారు. అఖిలపక్ష భేటీలో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ముందడుగు వేసిందని గుర్తుచేశారు.

అటవీ బిల్లును వ్యతిరేకిస్తాం: నామా నాగేశ్వర రావు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 32 బిల్లులతో కూడిన ఎజెండాను తమకిచ్చారని, ఇందులో పొందుపర్చిన అటవీ చట్టం (సవరణ) బిల్లును తాము వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు తెలిపారు. ఈ బిల్లు అటవీబిడ్డలను మోసం చేసేలా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన బిడ్డల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని నామా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్, నిరుద్యోగంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో గవర్నర్లు సమస్యలు సృష్టిస్తున్నారని నామా ఆరోపించారు. ఈ అంశంపై చర్చ జరగాలన్న డిమాండ్ అఖిలపక్ష భేటీలో వచ్చిందని తెలిపారు. దేశంలో కావాల్సినంత బొగ్గు అందుబాటులో ఉండగా, దిగుమతి చేసుకున్న బొగ్గును కచ్చితంగా వాడాల్సిందేనని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. తెలంగాణలో సింగరేణి గనులున్నాయని, అక్కడ చాలా బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని గుర్తుచేస్తూ దేశంలో లభించే బొగ్గు టన్నుకు రూ. 3 వేలు ఉంటే, రూ. 30 వేల ధర పలికే ఇంపోర్టెడ్ కోల్ (దిగుమతి చేసుకున్న బొగ్గు) వినియోగించాల్సిందేనని కేంద్రం బలవంతం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 3.65 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయని నామా నాగేశ్వర రావు తెలిపారు. ఇందులో రూ. 1.96 లక్షల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని, ఇది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాయేనని గుర్తుచేశారు. ఇదికాకుండా రాష్ట్రానికి ఇచ్చే నిధులపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement