Tuesday, November 26, 2024

కోవిడ్‌ పై భయం కాదు, జాగ్రత్తలు అవసరం!

దేశంలో మళ్ళీ కోవిడ్‌ కేసులు విజృంభిస్తుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.ఈ ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ రూపంలో కాకపోయినా, మరో రూపంలో జ్వరాలు జనాన్ని బీభత్సంచేస్తున్నాయి. కోవిడ్‌ అనుభవం దృష్ట్యా మామూలు జ్వరం వచ్చినా కోవిడ్‌ యేమోనని జనం ఆందోళన చెందుతున్నారు.అలాగే,ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం హెచ్‌-3,ఎన్‌-2 దేశవ్యాప్తంగా విస్తరించడం కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం.ఎంత జాగ్రత్తగా ఉన్నా దగ్గు,పడిశం,జలుబు,ముక్కుదిబ్బడ,ఒళ్ళు నొప్పులు వంటి రుగ్మతలు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.కోవిడ్‌ అనుభవాల దృష్ట్యా ఈసారి ఎవరూ చెప్పనక్కర లేకుండానే ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినా తుమ్మినా, దగ్గినా కోవిడ్‌ యేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ 754 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి.

వాతావరణంలో మార్పులకు అనుగుణంగా తమ జీవన విధానాన్ని మార్చుకోవాలన్న స్పృహ జనంలో ఉన్నప్పటికీ,అందుకు అనుకూలమైన పరిస్థితులు లేక పోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు జరగకపోవడం, ప్రజల్లో పారిశుధ్యంపై స్పృహ పెరగకపోవడం, మూతికి గుడ్డలు కట్టుకోవడం వంటి ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది.చైనాలో కూడా కరోనా మళ్ళీ విజృంభిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాస్తూ ఆరు రాష్ట్రాల్లో మళ్ళీ కోవిడ్‌ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఆరు రాష్ట్రాలు కోవిడ్‌ ని నిరోధించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని (స్పెషల్‌ డ్రైవ్‌) చేపట్టాలని సూచించారు. గత నవంబర్‌లో 734 కేసులు నమోదు కాగా, గత గురువారం నాలుగువేలకు పైగా కోవిడ్‌ కేసులు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖతన ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల నుంచి సమాచారాన్ని తెప్పించుకునికోవిడ్‌ నివారణకు తగిన సూచనలు,చర్యలు సిఫార్సు చేస్తోంది.అయితే, పలు రాష్ట్రాల్లో రాజకీయ వేడి కారణంగా కోవిడ్‌ కేసుల విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా కోవిడ్‌లోకి దింపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ముక్కుచీదడం,ఉమ్మి వేయడం వంటి అపరిశుభ్ర పద్దతుల వల్ల కూడా కోవిడ్‌ వ్యాపిస్తుంటుంది. కొన్ని కార్యాలయాల్లో పెద్దక్షరాల బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ గుట్కా అలవాటున్న వారు, అలవాటును మానుకోక పోవడం వల్ల కూడా ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో పాన్‌ పరాగ్‌, తంబాకు నమిలి ఉమ్మివేయడం వంటి అలవాటు చాలా మందికి ఉంటుంది. నోట్లో పాన్‌పరాగ్‌, తంబాకు పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఆ తుంపర్లు ఎదుటివారిపై పడుతుంటాయి. అది కూడా అనారోగ్య హేతువు.

ప్రాథమికంగా జన జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవడం చాలా అవసరం. అలాగే, చిన్న పాటి అనారోగ్యానికి వైద్యులు చీటీ రాసిచ్చారని చెప్పి యాంటీ బయోటెక్‌ మాత్రలను వాడుతూ ఉంటారు. ఈ మాత్రల వాడకంపై జనంలో అవగాహన కల్పించాలి. 650 డోలే మాత్రలను ఉత్తరాదిన ప్రతి రుగ్మతకూ వైద్యులు రాస్తున్నారనీ, ఇందుకోసం ఆ మాత్రలను ఉత్పత్తి చేసే కంపెనీ ప్రైవేటు వైద్యులకు నెలకింత చొప్పున సొమ్మును ముట్టజెబుతోందని అఖిల భారత మెడికల్‌ రిప్రజింటెటివ్‌ల సంఘం ఆ మధ్య ఆరోపించింది. ఈ విషయమై కేంద్రానికీ, సుప్రీంకోర్టుకూ వినతి పత్రాలను కూడా సమర్పించింది.ఇదొక్కటే కాదు. యాంటీ బయోటికె మాత్రల పవర్‌ గురించి తెలుసుకోకుండా వాడటం వల్ల లేని వ్యాధులు వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఆరోగ్య శాఖ ఎన్ని జాగ్రత్తలను సూచించినప్పటికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానంగా ప్రజల బాధ్యతే కనుక, ఏ రుగ్మతకు ఏ మాత్ర వాడాలో, ఎప్పుడు వాడాలో ప్రజలు కూడా కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అవసరం. ప్రతి ఇంట్లో మాత్రల కిట్‌ని అందరూ కలిగి ఉంటున్నారు.

వాటితో పాటు ఆ మాత్రలను వాడే విధానం పట్ల కూడా అవగాహన పెంచుకోవడం అత్యవసరం. ప్రధానంగా మన దేశంలో అటువంటి అవగాహన లేకపోవడం వల్లనే రోగాలు పెరుగుతున్నాయి. పిల్లలకు జలుబు, తుమ్ములు వంటి రుగ్మతల విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్య బాధ్యతలను ప్రధానంగా తల్లులే స్వీకరిస్తారు కనుక, వారిలో అవగాహన పెంచాలి. పట్టణాలు, నగరాల్లో మహిళల్లో చదువుకున్నవారు, చదువుకోకపోయినా సమాచారాన్ని అందించే ఆధునిక ప్రసార సాధనాల పట్ల అవగాహన ఉన్న వారు ఎక్కువమంది ఉంటారు కనుక ,వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా పల్లెల్ల్లో మహిళలకు ఈ విధమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ వల్ల రెండేళ్ళ క్రితం సంభవించిన పరిస్థితులకూ, ఇప్పటికీ తేడా ఉంది కనుక, ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటారనే నమ్మకం అందరిలోనూ ఉంది. అదే సందర్భంలో నిరంతర అప్రమత్తత కూడా అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement