Friday, November 22, 2024

అంకెల గారడీ కాదు, తగ్గించింది కేంద్ర పరిధిలోని సుంకాన్నే: ఆర్థిక మంత్రి నిర్మలా

న్యూఢిల్లి :పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సయిజ్‌ సుంకం తగ్గింపుపై కేంద్రం అంకెల గారడీతో ప్రజలను మోసగిస్తోందని కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తిప్పికొట్టారు. పెట్రోల్‌, డీజెల్‌ ధరల్లో రాష్ట్రాల వాటాకు వచ్చే బేసిక్‌ ఎక్సయిజ్‌ సుంకాన్ని తగ్గించి తామేదో చేసినట్టు కేంద్రం ప్రచారం చేసుకుంటోందని, ఈ నిర్ణయంవల్ల ధరల తగ్గుదలలో పెద్ద ప్రయోజనమేమీ ఉండదని విపక్షాలు చేస్తున్న ప్రధాన విమర్శకు ఆమె జవాబిచ్చారు. టిట్టర్‌లో ఆదివారం ఆమె వరుస టీట్లతో స్పష్టమైన వివరణ ఇచ్చారు. పెట్రోలు, డీజెల్‌ పై తగ్గించిన ఎక్సయిజ్‌ సుంకం పూర్తిగా కేంద్రం భరిస్తుందని, అది రాష్ట్రాల వాటాలోది కాదని స్పష్టం చేశారు. యూపీఏ పదేళ్ల పాలనలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుతం చేసి చూపించిందని పేర్కొంటూ గణాంకాలను పోల్చిచూపుతూ వివరించారు. బేసిక్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ (బీఈడీ) అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలకు సంబంధించినదే అయినప్పటికీ ఇప్పుడు తగ్గించినది కేవలం కేంద్రానికి సంబంధించిన వాటాలోనిదని ఆమె స్పష్టం చేశారు. స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ), రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ (ఆర్‌ఐసి), అగ్రికల్చర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మోరెట్‌ సెస్‌ (ఏఐడీసీ) కేంద్రం పరిథిలోకి వస్తాయని, వీటితో రాష్ట్ర ప్రభుతానికి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌వంటివాటిపై తగ్గించినది కూడా కేంద్రం పరిథిలోని సుంకాల్లోంచేనని తేల్చి చెప్పారు. బేసిక్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ (బీఈడీ)తో మాత్రం రాష్ట్రాలకు సంబంధం ఉంటుందని, అయితే తాజాగా తగ్గించిన అడిషనల్‌ ఎక్సయిజ్‌ సుంకం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదని వివరించారు. గత ఏడాది నవంబర్‌లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజెల్‌పై రూ.10 తగ్గించామని, అది కూడా కేంద్రం వాటాలోంచి అమలు చేశామని గుర్తు చేశారు. పెట్రోల్‌, డీజెల్‌ పై తాజాగా ఎక్సయిజ్‌ సుంకం తగ్గించడం వల్ల కేంద్రంపై ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కేంద్రంపై భారం పడనుందని, గత నవంబర్‌లో ఎక్సయిజ్‌ సుంకం తగ్గింపువల్ల ఏటా రూ.1.2 లక్షల కోట్ల భారం పడిందని, మొత్తంమీద 2.2 లక్షల కోట్ల మేర ఏటా కేంద్రంపై భారపడినట్టని తెలిపారు. పెట్రోల్‌, డీజెల్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని కేంద్రం వాటాలోంచి రెండుసార్లు తగ్గించిందని, మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజెల్‌పై వ్యాట్‌ చాలా ఎక్కువగా ఉందని, కొంత తగ్గిస్తే వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె గుర్తు చేశారు.

మా హయాంలో ప్రగతి ఇదీ..

ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తరువాత (2014-22) గడచిన ఎనిమిదేళ్లలో రూ.90.9 లక్షల కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేశామని, అదే 2004-14 మధ్యకాలంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుతం కేవలం రూ.49.2 లే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రిజర్‌ బ్యాంక్‌ పేర్కొన్న గణాంకాలను ఆమె ఈ సందర్భంగా ఉటంకిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఆహారం, ఇంధన, ఎరువుల సబ్సిడీల కోసం రూ.24.85 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, ఆయా రంగాల్లో సబ్సిడీల కోసం పదేళ్ల యూపీఏ పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.13.9 లక్షల కోట్లు మాత్రమేనని ఆమె వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement