క్రికెట్ అభిమానులను రెండు నెలలుగా అలరించిన టాటా ఐపీఎల్ 2022 ముగిసింది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవగా.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 15వ సీజన్‌లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్ వెల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో వంటి స్టార్ ప్లేయర్లు అంతగా రాణించలేదు. తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ ఆటగాళ్లు తమ శక్తికి మించి సత్తాచాటారు.
కాగా, ఐపీఎల్ 2022లో పాల్గొన్న తన బెస్ట్ ఎలెవన్‌ను టీమ్‌ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఆటగాళ్ల పేరు లేదా వారి గత ఆటతీరు ఆధారంగా జట్టును ఎంపిక చేయలేదని, ఐపీఎల్ 2022లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగానే టీమ్‌ని ఎంచుకున్నానని తన యూట్యూబ్ చానెల్ వీడియోలో పేర్కొన్నాడు. సచిన్ తన జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో హార్దిక్ అత్యుత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఓపెనర్లుగా జోస్ బట్లర్, శిఖర్ ధావన్‌లను ఎంపిక చేశాడు. ఎడమ-కుడి కలయిక బాగుంటుందన్నాడు. బట్లర్ 863 పరుగులు చేయగా.. ధావన్ 460 రన్స్ చేశాడు.
ఇక.. కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో సచిన్ ఎంచుకున్నాడు. బట్లర్ 15 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలతో సహా 616 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యాను నాలుగో స్థానం కోసం ఎంచుకున్నాడు. ఐదు, ఆరు స్థానాల్లో హిట్టర్లు డేవిడ్ మిల్లర్, లియమ్ లివింగ్ స్టోన్‌కు చోటు దక్కింది. ఇక 7వ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కింది. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్‌కి చోటు దక్కింది. బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్‌ను సచిన్ ఎంపిక చేశాడు.