కొత్త ఏడాది వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఏడాది వేడుకలను రాత్రంతా జరుపుకునేలా, మద్యం అందుబాటులో ఉంచుతూ సెలబ్రేషన్లకు సంపూర్ణ అనుమతులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇందుకు అనువుగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లలో స్పెషల్ ఈవెంట్లను అనుమతులనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలను డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటలవరకు తెరచిఉంచేలా ప్రత్యేక ఆదేశాలు వెల్లడించింది. బార్లు, ఈవెంట్లు, సెలబ్రేషన్లు, ఇతర వేడుకలకు టూరిజం హోటళ్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతులనిస్తూ ఈ ఉత్తర్వుల్లో వెల్లడించింది. కాగా ఒమిక్రాన్ నేపథ్యంలో జనవరి 2వరకు బహిరంగ సమావేశాలు, ప్రజలు గుమిగూడకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు పలు సడలింపులనిచ్చింది. గతవారం సర్కార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలను ప్రకటించింది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో రూ. 3500కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 2016 డిసెంబర్లో రూ. 1309కోట్లు, 2017లో రూ. 1644కోట్లు, 2018లో రూ. 1961కోట్లు, 2019లో రూ. 2046కోట్లు, 2020లో డిసెంబర్ నెలలో రూ. 2765కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లిక్కర్ వ్యాపారులకు డిస్కౌంట్లు, విదేశీ పర్యటన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అదనపు మార్జిన్‌తోపాటు, అనేక బహుమతులను ఇప్పటికే పెద్దపెద్ద సిండికేట్లకు అందించినట్లు తెలిసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సింగపూర్, బ్యాంకాక్, మలేషియా, థాయ్‌లాండ్ టూర్లకు పంపించేందుకు కూడా కంపెనీలు ఆఫర్లు ప్రకటించి వైన్స్ యాజమాన్యాలను ఆకర్షిస్తున్నాయి. దీంతో డిపోలనుంచి ఒకేసారి ఎక్కువమొత్తంలొ స్టాకును కొనుగోలు చేస్తూ ఇండెంట్‌లు పెడుతున్నారు.
అయితే పలు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించగా, గడచిన రెండున్నరేళ్లుగా కరోనా కారణంగా ఇబ్బందులపాలైన మద్యం వ్యాపారులు, ఈవెంట్ల నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ప్రభుత్వం ప్రకటనతో ఈవెంట్ల నిర్వహణతోపాటు, న్యూ ఇయర్ వేడుకల ఉత్సాహం పెరిగింది. ఈ మేరకు వ్యాపారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల్లో ఆనందం రెట్టింపైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital