Monday, November 18, 2024

Follow up | నిర్మల్‌ మెడికల్‌ కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతి.. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ కృషి ఫలిస్తోంది. సీఎం కేసీఆర్‌ సారధ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కృషితో నిర్మల్‌ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీకి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసి) మంజూరు చేసింది. ఈ మేరకు 100 మెడికల్‌ సీట్ల ప్రవేశానికి అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్‌ మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసి అనుమతి మంజూరు చేయడం పట్ల రాష్ట్ర్ర అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

నిర్మల్‌లో మెడికల్‌ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి హరీష్‌ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నిర్మల్‌ మెడికల్‌ కళాశాలలో తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. నిర్మల్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు నిర్మల్‌లో కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు మెడికల్‌ కాలేజీ మంజూరుకు కృషి చేసి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. కాగా, జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర్ర ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అవసరమైన నిధులను మంజూరు చేసింది. దీంతో పాటు ప్రభుత్వ స్థలం కూడా సమకూర్చింది. ఎన్‌ఎంసి అనుమతులతో ప్రభుత్వం నిర్మల్‌ మెడికల్‌ కాలేజీకి అవసరమైన సిబ్బందిని నియమించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement