Saturday, November 23, 2024

ప్రపంచ ర్యాంకుల్లో మన వర్సిటీలు మెరుగు.. 4వ ఉత్తమ ప్రాతినిధ్య దేశంగా భారత్‌

ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో భారతీయ విద్యా సంస్థలకు సముచిత గౌరవం దక్కింది. ఈ ఏడాది కూడా మనదేశం నుంచి బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రపంచ మేటి విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు గురువారం టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టిహెచ్‌ఈ) మేగజన్‌ 2024 ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ఇందులో బెంగళూరు ఐఐఎస్‌సి భారతీయ ఉత్తమ యూనివర్సిటీగా గౌరవం పొందింది. ఈసారి రికార్డుస్థాయిలో మనదేశం నుంచి 91 వర్సిటీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గతేడాది కేవలం 75 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. ఏటేటా ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంటూ, 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్య దేశంగా మారింది.

- Advertisement -

గతేడాది భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కూడా 2017 తర్వాత తొలిసారిగా గ్లోబల్‌ 250 ర్యాంక్‌కు చేరుకుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లు ఉత్తమ సంస్థలుగా అవతరించాయి.

ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ర్యాంకులు కలిగివున్నాయి. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం గతేడాది 801-1000 బ్యాండ్‌లో ఉండగా ఇప్పుడు 601-800కి చేరుకుంది. కోయంబత్తూరులోని భారతియార్‌ విశ్వవిద్యాలయం కూడా ఇదేవిధమైన పురోగతి సాధించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గౌహతి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) ధన్‌బాద్‌ ప్రపంచంలోని టాప్‌ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement