కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఓ ప్రకటన జారీ చేశాడు. తాను సొంతంగా సృష్టించుకున్న దేశంగా చెప్పుకుంటున్న ‘కైలాస’ ద్వీపానికి రాకపోకలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే భక్తులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రెసిడెన్షియల్ మాండేట్ పేరుతో ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయగా.. ఇండియాతో పాటు యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, మలేసియా నుంచి ఎవరూ కైలాసకు రావొద్దంటూ అందులో పేర్కొన్నాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిత్యానంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
అయితే నిత్యానంద ట్వీట్ చూసిన నెటిజన్లు అతడిని ఆడేసుకుంటున్నారు. కైలాస ద్వీపం ఎక్కడుందో కనీసం ఇప్పుడైనా చెప్తే వస్తామంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక ప్రపంచ అధినేత ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ కూడా రాలేదా పాపం అని కొందరు అంటే.. మరికొందరు వెంటనే విమానం టికెట్లు చేసుకోవాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాసలీలల కేసులో జైలుకు వెళ్లిన నిత్యానంద 2019 ఈక్విడార్ తీరంలోని ఓ ద్వీపంలో గడుపుతున్నాడు. దాన్నే కైలాస దేశంగా ప్రకటించుకుని అక్కడే ఉంటున్నాడు.