Wednesday, November 20, 2024

నితీశ్‌ విసిరిన కులగణన అస్త్రం.. బీజేపీకి ఇర‌కాటం..

బిహార్‌లోని అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న త‌ర్వాత‌ కుల గణన ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించడం బిహార్‌ రాజకీయాలలో సంచలనంగా మారింది. నిజానికి ఈ డిమాండ్‌ను ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ చాలా కాలంగా చేస్తున్నదే. దీంతో ఇక్కడ బీజేపీ ఇరకాటంలో పడింది. మే 27న అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ‘కులాల ప్రాతిపదికగా జనగణన చేయడంపై ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ అభిప్రాయాల ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందించి కేబినెట్‌ ముందు పెడతాం. మే 27న ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. ఇంకా కొన్ని పార్టీల నుంచి స్పందన రావలసి ఉంది. తుది నిర్ణయం తీసుకున్న తరువాత దానిని కేబినెట్‌ ముందుంచుతాం. ఆ తరువాత ఆ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని నితీశ్‌ సోమవారం విలేకరులకు తెలియజేశారు. కుల గణన చేపట్టాలని పదేపదే డిమాండ్‌ చేస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఈ ఉద్యమాన్ని హస్తిన వరకు తీసుకెళ్తానంటూ స్పష్టం చేయడంతో నితీశ్‌ రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపారు.

ఇక‌.. రాష్ట్రంలో కులగణన చేపట్టండపై ఓ ప్రణాళికను కూడా ఇరువురు నేతలు కలిసి ఖరారు చేశారు. ఈ పరిణామం కమలనాథులను కంగారు పెడుతుందని తెలిసి కూడా నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశం జరిగిన తరువాతనే ఆర్జేడీ వ్యవస్థకుడు, తేజస్వి తండ్రి లాలూ యాదవ్‌ నివాసంపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయని ఆర్జేడీ ఆరోపిస్తున్నది. అయితే, కులగణనకు బీజేపీ ఆమోదం తెలిపిందా అన్న ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు తారాకిషోర్‌ ప్రసాద్‌ సమాధానం దాటవేశారు. ఈ అంశాన్ని మేము సమగ్రంగా చర్చించాల్సి ఉందని మాత్రం చెప్పారు. బీజేపీ ఇరుకున పడిన విషయం ఆ సమాధానంలో కనిపిస్తున్నది. వాస్తవానికి బీహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ… బీజేపీ సహా… కులగణనకు మద్దతు పలుకుతున్నాయి. అయితే, కేంద్రంలోని అధికార పక్షం మాత్రం కుల గణనకు వ్యతిరేకంగా ఉంది. కుల గణన అనేది సమాజంలో చీలికను తెస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది.దేశంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement