ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో గర్జించిన తెలుగు తేజం… టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని, త్వరలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నగదు పురస్కారం అందజేస్తామన్నారు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌తో అరంగేట్ర శతకాన్ని అందుకున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ సంచలన బ్యాటింగ్‌తో టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
పోరాడుతున్న భారత్ !
కాగా, బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.
నితీష్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 105 బ్యాటింగ్)తో పాటు మహమ్మద్ సిరాజ్ (0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. నితీష్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో ఫోర్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.