న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆధునిక వైద్య విధానాలతో పాటు సంప్రదాయ వైద్య విధానాలు సైతం కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భాగం పంచుకున్నాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డా. ముంజ్‌పారా మహేంద్రభాయ్ కాలూభాయ్ అన్నారు. యావత్ ప్రపంచాన్ని గడగడా వణికించిన కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారతదేశం అనుసరించిన సాంప్రదాయ, సాంప్రదాయేతర వైద్యవిధానాలపై నీతి ఆయోగ్ రూపొందించిన కంపెడియంను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరితో కలిసి కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డా. వీకే పాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు అల్లోపతితో పాటు ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి వైద్యవిధానాలు సైతం దోహదపడ్డాయని, ఆయుష్ విభాగంలో పనిచేసే సిబ్బంది కోవిడ్-19 నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో పనిచేశాయని తెలిపారు. ఆయుష్ మంత్రిత్వశాఖలోని విభాగాలు, అధికారులు, సిబ్బంది సైతం తమ వంతుగా ఈ మహమ్మారిని నియంత్రించడంలో భాగం పంచుకున్నారన్నారు. నిజానికి ఈ సమయంలో ఆయుష్ వైద్య విధానాల ఉపయోగం గురించి యావత్ దేశానికి తెలియజేసే అవకాశం దొరికిందని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన ఆయుష్ విధానాలు, అవి ఏ మేరకు కోవిడ్-19 నియంత్రణలో దోహదపడ్డాయో తెలియజేసే సమగ్ర వివరాలతో నీతి ఆయోగ్ ఈ కంపెండియంను రూపొందించింది. మనదేశంలో అనుసరించిన ఈ విధానాలు మిగతా ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, భవిష్యత్తులో రాబోయే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కోవడంలో ఒక దిక్సూచిలా నిలుస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమర్ బెరి అన్నారు. దేశంలో దేశీయ సాంప్రదాయ వైద్య విధానాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నివేదిక దోహదపడుతుందని, ఆధారాలో కూడిన ఆయుష్ సేవలను ఆధునిక వైద్యంతో అనుసంధానం చేయడానికి దోహదపడుతుందని నీతి ఆయోగ్ సభ్యులు డా. వీకే పాల్ అన్నారు.
తెలంగాణ చురుకైన పాత్ర..
ఆయుష్ విధానాలను కోవిడ్-19పై పోరులో వినియోగించడంతో పాటు ఆయుష్ వైద్య సిబ్బందిని ఆ మహమ్మారిపై పోరులో భాగస్వాములను చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 206 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 255 మంది ఆయుష్ ఫార్మసిస్టులు కలిపి మొత్తం 461 మంది కోవిడ్ సర్వైలెన్స్ విధుల్లో పాల్గొన్నారని, కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీవర్ – ఇన్ఫెక్షన్ సర్వే, క్వారంటైన్ / ఐసోలేషన్ సెంటర్లకు తరలింపు, నిర్వహణలో విధులు నిర్వర్తించారని నివేదిక పేర్కొంది. అలాగే 120 మంది ఆయుష్ ల్యాబ్ అసిసెంట్లను శాంపిల్ కలెక్షన్లకు, డాటా మేనేజ్మెంట్ కి వినియోగించారు. 1,126 మంది ఆయుష్ వైద్యులకు ఆస్పత్రి ప్రొటోకాల్స్ పై శిక్షణనివ్వడంతో పాటు 1,094 ఆయుష్ సిబ్బందికి ఆయుష్ క్వారంటైన్ సెంటర్ల విధుల నిర్వహణకు శిక్షణ ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 80 మంది ఆయుష్ డాక్టర్లు, 50 మంది ఫార్మసిస్టులు టెలీ మెడిసిన్ సేవల్లో వినియోగించుకున్నారు.
అలాగే కోవిడ్ రక్షా కిట్స్ పేరుతో 20,000 ఆయుర్వేద కిట్లను (చ్యవన్‌ప్రాశ్ లేహ్యం, ఆయుష్-64 ట్యాబ్లెట్లు, సంశమనివటి, జీవనధార, జాతుంగ ధూపన) పోలీసులు, నర్సులు, ఆరోగ్యవిభాగం సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వారియర్లకు అందజేసింది. ప్రపంచానికి కొత్తగా పరిచయమైన కోవిడ్-19 నియంత్రణలోనే కాకుండా అప్పటికే తెలిసిన బ్లాక్ ఫంగస్ వంటి కోవిడ్ అనుబంధ సమస్యలపై పోరులోనూ ఆయుష్ వైద్య విధానాలను అనుసరించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 137 మంది బ్లాక్ ఫంగస్ రోగులపై తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేడెట్ క్లినికల్ స్టడీ చేపట్టి అందులో ఆయుర్వేద వైద్యులను భాగం చేసింది. అలాగే హోమియోపతి నుంచి ప్రివెంటివ్ కిట్ల పంపిణీ, యునాని నుంచి కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ పై చికిత్సా విధానాలను అనుసరించింది. వీటితో పాటు యోగాసనాలు, ప్రాణాయమ, క్రియాలు, న్యాచురోపతి, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.