Friday, November 22, 2024

నితీష్ యు ట‌ర్న్… క‌మ‌లం వైపు చూపులు

న్యూఢిల్లి: బీహార్‌లో రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది మాసాల కిందట జట్టు కట్టిన నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యు), లాలూకి చెందిన ఆర్జేడీకి మధ్య స్నేహం చెదురుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార బదలాయింపు కోసం నితీశ్‌పై డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ఒత్తిళ్లే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నితీశ్‌ పొత్తుపై యూ టర్న్‌ తీసుకోబోతు న్నారని జేడీయూ వర్గాల్లో కొందరు బయటకు లీకులిస్తున్నారు. మరోవైపు 2024 సార్వత్రిక సమీకరణలపై దృష్టి సారించిన బీజేపీ సైతం, నితీశ్‌తో చెలిమికి చేతులు చాచే పనిలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల బీహార్‌కు కొత్తగవర్నర్‌ను నియమించిన వేళ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేరుగా నితీశ్‌కు ఫోన్‌చేసి మాట్లాడటం, గవర్నర్‌ విషయం తెలియజేయడం ఈ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయనే సంకేతాలను ఇచ్చింది.


ఇటీవల గాల్వాన్‌ అమరజవాన్‌ తండ్రిపై పోలీసుల చర్యను తేజస్వి యాదవ్‌ సమర్థించడం కూడా జేడీయూతో విభేదాలకు దారితీసింది. ఈ ఘటనపై నితీశ్‌ విచారణకు ఆదేశించారు. మార్చి 1న నితీశ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫోన్‌ చేయడం, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తమిళనాడులో బీహారీ కార్మికులపై దాడుల విషయంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాడుల ప్రచారాన్ని తేజస్వి కొట్టిపారేయగా, దీనిపై వివరాలు తెలుసుకునేందుకు నితీశ్‌ అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపారు. మరోవైపు రాష్ట్ర మాజీడిప్యూటీ సీఎం తారా కిషోర్‌ తండ్రి శ్రాద్ధ కర్మల్లో పాల్గొనేందుకు నితీశ్‌ శనివారం కతిహార్‌ చేరుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కతిహార్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వరుస పరిణామాలను గమనిస్తుంటే, నితీశ్‌ కుమారు మెల్లమెల్లగా యూ టర్న్‌ తీసుకుంటున్నారనే సందేహం తలెత్తుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement