Wednesday, November 20, 2024

Nirmal: పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే లక్ష్యం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, (ప్రభ‌ న్యూస్) : పేదలు ఆత్మగౌరవంగా బ‌త‌కాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో బంగ‌ల్ పేట్, నాగ‌నాయి పేట‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌వ‌ర్గంలో దశలవారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

మౌలిక సదుపాయాలు పూర్తి కావడంతో విడ‌త‌ల వారీగా గృహ ప్ర‌వేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల సాకారం కాబోతుందని అన్నారు. నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని నాగ‌నాయి పేట్ లో రూ.54.24 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 1014 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, బంగ‌ల్ పేట్ (ఖురాన్ పేట్) లో రూ.23.86 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 446 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ( మొత్తం రూ. 78 కోట్ల వ్యయంతో నిర్మించిన‌ 1460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు) గృహ ప్ర‌వేశాల‌కు సిద్దంగా ఉన్నాయ‌ని అన్నారు.

ఈ నెల 19న సామూహిక గృహ ప్ర‌వేశాలకు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే సీయం కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించుకున్నామ‌ని గుర్తు చేశారు. ల‌బ్ధిదారుల ఎంపిక కూడా పూర్తైంద‌ని, వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా సిద్దాపూర్ లో 600 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. మంత్రి వెంట‌ క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, ఇత‌ర అధికారులు ,స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement