భారత్‌ను వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు దిగిరావడం, రికవరీ రేటు భారీగా పెరగడం సానుకూల సంకేతాలు పంపుతోంది. దేశంలో సెకండ్ వేవ్ నెమ్మదిస్తోందని, నియంత్రణలను క్రమబద్ధంగా తొలగిస్తూ పోతే పరిస్థితి అదుపులోకి వస్తుందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు.
మరోవైపు కరోనా నుంచి పెద్ద సంఖ్యలో రోగులు కోలుకుంటుండటంతో రికవరీ రేటు 85.6 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ కేసులను మించి రికవరీలు పెరుగుతున్నాయని రికవరీ రేటు 90 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత వారం రోజులుగా 24 రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో తగ్గుదల నమోదైందన్నారు.