ప్రతి చిన్నారిలో అంతర్లీనంగా ఏదో కళ దాగుండే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దానిని గుర్తించి మరింత పదును పెట్టడం, చిన్నారులకు సరైన శిక్షణ అందించడం ముఖ్యం. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తన కళతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందాడు. 55 సెకన్‌లలోనే 15 స్తోత్రాలను పారాయణం చేసి వావ్ అనుకునేలా చేశాడు. ఢిల్లీ పీతంపూరలోని భారతి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ వివాన్ ప్రతిరోజు ఉదయాన్నే తన నానమ్మ ‘శివ తాండవ స్తోత్రాలు’ పారాయణం చేయడాన్ని గమనించి వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. నానమ్మ స్తోత్రాలు చదవుతున్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. క్లిష్టమైన శ్లోక స్తోత్రాలను కంఠస్థం చేయడంతో పాటు లయబద్ధంగా పాడటం తెలుసుకున్నాడు. కఠినమైన శివస్తోత్రాలు వివాన్ అవలీలగా పాడటం చూసి ఆశ్చర్యపోయిన అతడి తాతయ్య.. అప్పటి నుంచి వివాన్‌కు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ స్తోత్ర పారాయణానికి సంబంధించిన పలు విషయాలు చెప్పాడు.
తాజాగా వివాన్ కఠినమైన ‘శివ తాండవ స్తోత్రాల’ను కేవలం 55 సెకన్లలో పారాయణం చేసి రికార్డు సృష్టించాడు. ఈ మేరకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ రికార్డు ప్రదానం చేయడంతో వివాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో క్లిష్టమైన స్తోత్రాల పారాయణం చేయడం అరుదైన విషయమని, అది ఈశ్వరానుగ్రహమని వివాన్ తాతయ్య తెలిపాడు. వివాన్ కృషి, పట్టుదలతో ఈ ఫీట్ సాధించాడని, తనకు చాలా గర్వంగా ఉందని వివరించాడు. అయితే వివాన్ ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోని ఏడు ఖండాలు చుట్టివచ్చిన అతిపిన్న వయస్కుడిగా స్థానం పొందడం విశేషం.