అమరావతి, ఆంధ్రప్రభ : శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 2,38,561 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 2,02,811 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అయిదు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట సామర్ద్యం 885 అడుగులకు గాను శుక్రవారం రాత్రికి 884.84 అడుగులకు నీరు చేరింది. 215.81 టీ-ఎంసీల గరిష్ట నిల్వకు గాను 214.84 టీ-ఎంసీల నిల్వలున్నాయి. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పాదన చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, తెలంగాణలోని జూరాల, ఏపీ పరిధిలోని తుంగభద్ర నుంచి భారీ స్థాయిలో వరద ఉధృతి శ్రీశైలం వైపు పరుగు పెడుతోంది. శ్రీశైలంకు ఎగువన జూరాల నుంచి 78,188 క్యూసెక్కులు, ఏపీ సరిహద్దులోని తుంగభ్రద నుంచి 47,769 క్యూసెక్కుల వరద నీటిని అవుట్ ఫ్లోరూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
దీనికి స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడవటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. దీంతో నాగార్జునసాగర్ కూడా జలకళ సంతరించుకుంటోంది. 312.05 టీఎంసీల గరిష్ట నీటి నిల్వకు గాను జలాశయంలో 245.34 టీఎంసీల నిల్వలున్నాయి. సాగర్ కు 1,32,833 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 6,421 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో నీటి నిల్వలు 85.79 శాతానికి చేరువయ్యాయి. 45.77 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్ద్యానికి గాను 39.27 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వైపు ప్రకాశం బ్యారేజ్ వరద నీటితో పరవళ్ళు తొక్కుతోంది. 3.07 టీఎంసీల గరిష్ట స్థాయి నీటి నిల్వలుండగా 33,640 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. 23,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.