మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ టోర్నీకి బీసీసీఐ మహిళా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సానికా చాల్కే వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. కాగా, వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు చోటు దక్కించుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు.. విశాఖపట్నంకు చెందిన షబ్నం అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన మహిళల అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఈ ముగ్గురూ మంచి ప్రదర్శన చేశారు.
ఇక మలేషియాలోని కౌలాలంపూర్‌లో వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 16 జట్లు ఆడనుండగా.. నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్‌లోని రెండు గ్రూప్‌లలోని టాప్ 2 జట్లు సెమీస్‌లోకి ప్రవేశిస్తాయి.
గ్రూప్-ఏలో మలేసియా, శ్రీలంక, వెస్టండీస్‌తో ఉన్న భారత్ ఉంది. జనవరి 19న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. 21న మలేసియా రెండో మ్యాచ్, జనవరి 23 శ్రీలంకతో మూడో మ్యాచ్‌లో తలపడనుంది.
కాగా, అండర్ 19 స్థాయిలో ఇది రెండో మహిళా టీ20 ప్రపంచకప్ కాగా.. 2023లో జరిగిన తొలి అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది.
భారత జట్టు :
నిక్కీ ప్రసాద్(కెప్టెన్), సానికా చల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమిలిని జి(వికెట్ కీపర్), భవికా అహిరె (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్, జోషితా వీజే, సోనమ్ యాదవ్, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి, ఆయుషి, శుక్లా, అనందితా కిశోర్, షబ్నమ్, వైష్ణవి.
స్టాండ్ బై ప్లేయర్లు:
నందన, ఐరా, అనధి