క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మొన్న బ్మాడ్మింటన్‌లో.. సత్తా చాటిన ఇండియన్ షట్లర్లు.. థామస్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ వేటకు మన తెలంగాణ అమ్మాయి సిద్ధమైంది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా.. స్వర్ణం లేదా రజత పతకాల్లో ఏదో ఒకదాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం సాయంత్రం సెమీస్‌లో నిఖత్.. బ్రెజిల్‌కు చెందిన డి అల్మిద కరోలిన్‌ను 5-0 తేడాతో ఓడించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. 52 కేజీల విభాగంలో పోటీ పడుతున్న నిఖత్.. నేడు ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్తో పోటీ పడనుంది.
పసిడి గెలిస్తే చరిత్రే..
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లి పతకం నెగ్గిన వారిలో ఆరు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరికోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ ఉన్నారు. తాజాగా నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పసిడితో రాణిస్తే.. వీరి సరసన నిఖత్ నిలుస్తుంది. ఇక ఫైనల్లో నిఖత్ పతకం గెలిస్తే.. మరో చరిత్రే అవుతుంది. జరీన్‌తో పాటు 57 కేజీల విభాగంలో మనీషా మౌన్, 63 కేజీల విభాగంలో పర్వీన్ హుడాలు కూడా సెమీస్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఇటలీకి చెందిన ఇర్మా టెస్టా చేతిలో మనీషా 0-5 తేడాతో ఓడిపోయింది. అదేవిధంగా యూరోపియన్ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత అమీ బ్రాడ్‌హర్స్ట్ చేతిలో ఇండియా యువ బాక్సర్ పర్వీన్ హుడా 1-4 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఇద్దరికి కాంస్య పతకాలు దక్కాయి. ఈ ఈవెంట్లో ఆది నుంచి రాణిస్తున్న జరీన్.. ప్రీమంగోలియాకు చెందిన అల్తాంట్సెట్సెగ్ను చిత్తు చేసింది. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ అమ్మాయి చార్లీ సియాన్ డేవిసన్‌ను 5-0తో మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. మాజీ జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గానూ జరీన్ నిలిచింది. ప్రత్యర్థిపై ఆది నుంచి విరుచుకుపడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..