Saturday, November 23, 2024

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌

మహిళల ప్రపంచకప్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పసిడిపంట పండిస్తున్నారు. శనివారం రెండు స్వర్ణపతకాలు సొంతం చేసుకోగా, ఆదివారం మరో స్వర్ణం లభించింది. 50 కేజీల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ పసిడి పట్టు పట్టింది. బలమైన ప్రత్యర్థిని సునాయాసంగా చిత్తుచేసింది. రెండుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ విజేత అయిన వియత్నాం బాక్సర్‌ న్యూయెన్‌ టాన్‌పై 5-0తో నిఖత్‌ సంచలన విజయం నమోదు చేసింది.

గతేడాది స్వర్ణంతో మెరిసిన నిఖత్‌ వరుసగా రెండవ ఏడాది కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. భారత ఆల్‌టైమ్‌ దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ నెగ్గిన రెండవ భారత బాక్సర్‌గా నిఖత్‌ చరిత్ర సృష్టించింది. గతేడాది 52 కేజీల విభాగంలో ఆమె పసిడి పతకం సొంతం చేసుకుని, తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈసారి 50 కేజీల విభాగంలో మరోసారి దుమ్మురేపింది.

నిఖత్‌ రికార్డులు..

  • 2011 ప్రపంచ జూనియర్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణపతకం.
  • 2015 జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో పసిడి
  • 2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజత పతకం.
  • 2019, 2022లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి.
  • 2022 ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2022 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ బంగారు పతకం.
  • 2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం
Advertisement

తాజా వార్తలు

Advertisement