Friday, November 22, 2024

రాత్రిళ్లు చలి.. మధ్యాహ్నం ఎండలు – ఎల్‌నినో ప్రభావమంటున్న వాతావరణశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాత్రి వేళల్లో తీవ్ర చలి ఉన్నా.. మధ్యాహ్నం వేళల్లో మాత్రం ఎండలు మడిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకోనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్తితులు కూడా నెలకొనే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగనుందని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసీఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు చలి తీవ్రత పెరగనుందని చెప్పింది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పొగమంచు కురవనుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో చలి గజగజ వణికిస్తోంది. దీంతో మరోసారి ఎల్లో అలర్ట్‌ జారీ అయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల వరకు పడిపోనున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో మూడు రోజులపాటు చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 16.4 డిగ్రీలు, హకీంపేటలో 18.1, ఖమ్మంలో 19.4 డిగ్రీలు, మెదక్‌లో 16.3 డిగ్రీలు, నల్గొండలో 18.4 డిగ్రీలు, రామగుండంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement