న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో త్వరలో నైట్ స్కై శాంక్చురీ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’, బెంగళూరు సహాయంతో ఈ శాంక్చురీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటులో చాలా చురుగ్గా సహకరిస్తున్న లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) బీడీ మిశ్రాను కేంద్ర మంత్రి అభినందించారు.
అలాగే తమ మంత్రిత్వశాఖ తరఫున తూర్పు లద్దాఖ్‌లోని హాన్లే ప్రాంతాన్ని నైట్ స్కై రిజర్వ్‌గా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరనున్నట్టు తెలిపారు. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి నాలుగేళ్లయిన సందర్భంగా ‘లద్దాఖ్ ప్రైడ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా.. ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా డార్క్ స్కై రిజర్వ్ తూర్పు లడఖ్‌లోని హన్లే గ్రామంలో చాంగ్‌తంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఉందని తెలిపారు. ఇది భారతదేశంలో ఆస్ట్రో-టూరిజంను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆప్టికల్, ఇన్‌ఫ్రా-రెడ్‌తో పాటు గామా-రే టెలిస్కోప్‌ల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఇదొకటని వివరించారు. చాంగ్‌తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో మొత్తం 1,073 చదరపు కిలోమీటర్ల మేర ‘నైట్ స్కై రిజర్వ్’ విస్తరించి ఉంది.
సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రపంచంలోనే రెండవ-అత్యున్నత ఆప్టికల్ టెలిస్కోప్ కలిగిన ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి ఆనుకొని ఈ శాంక్చురీ ఉంది. చంద్రయాన్-3 మరియు ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ల విజయాన్ని దేశం జరుపుకుంటున్న తరుణంలో, ఈ డార్క్ స్కై రిజర్వ్ అంతరిక్ష పరిశోధకులు, ఔత్సాహికులను ఆకర్షిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇలాంటివి ప్రపంచంలో 15 లేదా 16 మాత్రమే ఉన్నాయని తెలిపారు.