ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
థానే రూరల్ ప్రాంతంలో 31 చోట్ల, థానే సిటీలో 9 చోట్ల, పూణెలో రెండు చోట్ల, మీరా భయాందర్‌లో ఒక చోట ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక చోట అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో 13 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.