న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు కొండలు, గుట్టలు దాటి 6 కి.మీ నడచి వెళ్లాల్సి వస్తోందని వచ్చిన కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో సుమారు 60 మంది విద్యార్ధులు కొండలు, గుట్టలు దాటి నడిచి స్కూలుకు పొరుగు గ్రామంలో పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఈ అంశంపై పత్రికలు, టీవీ ఛానెళ్లలో కథనాలు వచ్చాయి. విద్యార్ధుల బాధలు చూసి చలించిన ఓ ఎన్జీవో తాత్కాలిక స్కూల్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి రావడంతో సూమోటోగా కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఎన్జీవో స్కూల్ ఏర్పాటు చేసినప్పటికీ బోధన సిబ్బందిని ఎందుకు కేటాయించలేదని నోటీసుల్లో ప్రశ్నించింది. గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు ఎటువంటి చర్య తీసుకున్నారో చెప్పాలని పేర్కొంది.