భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) లేదన్న మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వయంచాలకంగా స్వీకరించింది. నిబంధనల మేరకు ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయని డబ్ల్యుఎఫ్‌ఐ సహా మొత్తం 15 క్రీడా సమాఖ్యలకు గురువారం తాకీదులు ఇచ్చింది. మీడియా నివేదికలోని విషయాలు నిజమైతే, చట్టాన్ని ఉల్లంఘించిన ఫెడరేషన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. క్రీడాకారుల చట్టపరమైన హక్కు, గౌరవంపై ప్రభావం చూపే అంశంగా దీన్ని గుర్తిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ), రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ)తోపాటు హ్యాండ్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, యాచింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్ ్స అండ్ స్నూకర్స్, కానోయింగ్, జూడో, స్క్వాష్, ట్రయాథ్లాన్, కబడ్డీ, ఆర్చర్, బ్యాడ్మింటన్ వంటి 15 జాతీయ క్రీడా సమాఖ్యలకు నోటీసులు పంపింది.
ఐసీసీ ప్రస్తుత స్థితితోపాటు, సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలతో సహా వివరణాత్మక నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని వారిని కోరింది. నివేదికల ప్రకారం, రెజ్లింగ్ ఫెడరేషన్‌తో సహా ఐదు ఫెడరేషన్‌లకు ఐసిసి కూడా లేదు. నాలుగు సమాఖ్యలకు నిర్ణీత సభ్యుల సంఖ్య లేదు. మరో ఆరు ఫెడరేషన్‌ల లో తప్పనిసరి బా#హ్య సభ్యులు లేకపోలేదు. ఒక ఫెడరేషన్‌లో రెండు ప్యానెల్‌లు ఉన్నాయి, కానీ ఏ ఒక్కదానికీ స్వతంత్ర సభ్యుడు లేరని పేర్కొనబడింది.