Tuesday, November 26, 2024

బ్లాక్‌ స్పాట్‌లపై కేంద్రం ఫోకస్‌.. ప్రమాదాలు తగ్గించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యాలకు తోడూ జాతీయ రహదారుల నిర్మాణంలో లోపాలు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అంగవైకల్యంగా మిగిలిపోతున్నారు. రోడ్డు భద్రతా నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మరణాలు రహదారులపైనే జరుగుతున్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారిలో అత్యధికంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది అతివేగం, మద్యపానం సేవించి వాహనాలు నడపటం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. దీనికితోడూ దేశంలోని జాతీయ రహదారులపై బ్లాక్‌ స్పాట్‌లు(మృత్యువు సంభవించే ప్రాంతం) ఉండటం కూడా మరోక కారణం. అయితే జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌ స్పాట్‌లపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ దృష్టి సారించి ప్రమాదాలు నివారించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో పనులను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో 336 బ్లాక్‌ స్పాట్‌లు..

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 3,174 కిలోమీటర్లు ఉంటే, 25 జాతీయ రాహదారుల్లో మొత్తం 336 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని వికరాబాద్‌, పరిగి గుండా వెళ్లే ఎన్‌హెచ్‌-163పై అత్యధికంగా 33 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా ఎన్‌హెచ్‌లపై కూడా పదుల సంఖ్యలో బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత మూడేళ్లలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలో ఉండే జాతీయ రహదారులపై ఉన్న 3,996 బ్లాక్‌ స్పాట్‌లపై 57,329 ప్రమాదాలు జరిగితే 28,765 మంది మృత్యువాతపడ్డారని ఎన్‌హెచ్‌ఏఐ గణాంకాలు చెబుతున్నాయి. 496 బ్లాక్‌స్పాట్‌లతో తమిళనాడు రాష్ట్రం ముందువరుసలో ఉండగా, ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ 450, కర్ణాటకలో 408, ఆంధ్రప్రదేశ్‌లో 357, 336 బ్లాక్‌స్పాట్‌లతో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. గత నాలుగేళ్లలో (2017 నుంచి 2020) రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌లపై 9,129 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే బ్లాక్‌స్పాట్‌లలో ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ప్రపంచ బ్యాంకుతో కేంద్ర ప్రభుత్వం కలిసి రూ.7,500 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాంతాలను ప్రమాదరహితంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. గతేడాది నుండి తమిళనాడులో అమలు జరపగా బ్లాక్‌స్పాట్‌ల వద్ద 50శాతం మరణాలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ గతంలో స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బ్లాక్‌స్పాట్‌లలో పనులు మొదలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ పనులకు సంబంధించిన డ్రాప్టును ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రమాదాల నివారణకు రూ.680 కోట్లు..!

బ్లాక్‌స్పాట్‌లల్లో ప్రమాదాలు తగ్గించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపుల భద్రతతో కూడిన సైన్‌ బోర్డులు, హెచ్చరిక బోర్డులు పెట్టనున్నారు. అవసరమైన చోట గ్రేడ్‌ సెపరేటర్స్‌ నిర్మాణం, రోడ్డు వెడల్పువంటి పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఉపరితల, రోడ్డు రవాణా శాఖ డ్రాప్టును ఇప్పటికే తయారు చేసినట్లు సమాచారం. కేంద్రం మొత్తం ఖర్చు చేసే రూ.7,500 కోట్ల నిధుల్లో రూ.680 కోట్లతో తెలంగాణలో త్వరలో పనులు చేపట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement