Wednesday, November 20, 2024

Delhi: ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాల్సిందే.. భారీ పరిహారంపై తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకున్న పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజక్టుల నిర్మాణం అంశంపై ఎన్జీటీ జాయింట్ కమిటి విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్జీటి ఇచ్చిన తీర్పులో భారీ పెనాల్టీ అంశం మినహా మిగతా అన్ని అంశాలను యదాతథంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్జీటి విధించిన రూ. 250 కోట్ల నష్టపరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం వెల్లడించింది. అప్పటివరకు ఎన్జిటీ తీర్పులోని మిగిలిన అంశాలను అమలు చేయాలని ఆదేశించింది. జాయింట్ కమిటీ సిఫార్సు ప్రకారం పురుషోత్తపట్నంకు రూ. 2.48కోట్లు, పట్టిసీమకు రూ. 1.90కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పెంటపాటి పుల్లారావు, వట్టి వసంత్ కుమార్, మాడిచర్ల సత్యనారాయణ, జమ్ముల చౌదరయ్యలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement