న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమకు అంతగా పట్టులేని రాష్ట్రాల్లో ప్రచారాన్ని హోరెత్తించాలని భావిస్తోంది. పార్టీకి పట్టు లేకున్నా ఆయా రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా విశేష ప్రజాదరణ కల్గిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేవారం తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా పర్యటించే అవకాశం ఉంది. వాటిలో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే అధికారిక పర్యటనలు కాగా, మరికొన్ని పూర్తిగా పార్టీ ఏర్పాటు చేసే ప్రచార సభలేనని తెలుస్తోంది.
భారతదేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై తన దృష్టి కేంద్రీకరించింది. ఫిబ్రవరి 27న కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి మోదీ తన పర్యటన ప్రారంభించనున్నారు. అందులో భాగంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను మోదీ సందర్శించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్కడే ఒక భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కణ్ణుంచి తమిళనాడుకు వెళ్లి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామళై చేపట్టిన యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. మధురైలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటల్ మొబిలిటీ ఈవెంట్లో కూడా పాల్గొంటారు.
ఫిబ్రవరి 28న తూత్తుకూడిలో కొన్ని శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఇది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి కనిమొళి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు తుత్తుకూడి నేరుగా మహారాష్ట్ర యవత్మాల్ చేరుకుని అక్కడ కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. అక్కడే పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఈ నెలాఖురున లేదా వచ్చే నెల మొదటివారంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సందర్శించి అక్కడ కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నట్టు సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తన ఓవరాల్ స్కోర్ పెంచుకుని సొంతంగానే 303 స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసలు ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈసారి బీజేపీ సొంతంగా టార్గెట్ 370 అంటూ మొత్తం కూటమి మిషన్ 400 ప్లస్ సీట్లు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న పరిస్థితుల్లో 101 స్థానాలున్న ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడమే కాదు, వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాల్సి ఉంటుంది. అందుకే ఈ రాష్ట్రాల్లో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ప్రజాదరణను ఓట్లుగా మలచుకునేందుకు వీలైనన్ని ఎక్కువ సభల్లో ప్రధాని మోదీ పర్యటించేలా పార్టీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.