న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 24కి వాయిదా వేసింది. మంగళవారం రౌజ్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయా కృష్ణన్, మోహిత్ మాథుర్ హాజరు కాగా, సీబీఐ తరఫున డీపీ సింగ్ తమ వాదనలు వినిపించారు. ఒక నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత, దాన్ని మిగతా అథారిటీస్ ఆమోదించాక, సమిష్టి నిర్ణయంగానే పరిగణించాలని సిసోడియా తరఫు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. కేసులో చార్జిషీటు కూడా దాఖలైందని, దర్యాప్తు పూర్తయిందని తెలిపారు. సిసోడియా ఇప్పటికే సీబీఐ కస్టడీలో 24 రోజులు ఉన్నారని, ఇంకా సిసోడియాను జైల్లోనే కొనసాగించాల్సిన అవసరం లేదని వారు వాదించారు.
సిసోడియా భార్య డీజనరేటివ్ వ్యాధితో బాధపడుతున్నారని, అది నయం అయ్యే వ్యాధి కాదని, చికిత్స కొనసాగిస్తూ ఉండాలని న్యాయస్థానానికి విన్నవించారు. సిసోడియా కొడుకు కూడా ఇండియాలో ఉండడం లేదని తెలిపారు. సిసోడియా 18 మంత్రిత్వ శాఖలు నిర్వహించారని, అందులో ఎక్సైజ్, ఆర్థిక శాఖ వంటి కీలక శాఖలున్నాయని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన విదేశాలకు పారిపోకపోయినా కేసులో సాక్ష్యాలు, ఆధారాలను ధ్వంసం చేయగలరని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన తన మొబైల్ ఫోన్లతో పాటు కొన్ని ఫైళ్లను ధ్వంసం చేశారని, ఈ వ్యవహారం మొత్తం బయటికొచ్చాక ఇదివరకే అందరి ఆమోదం పొందినట్టు రికార్డులు సృష్టించే ప్రయత్నం కూడా చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
కొత్త మోడల్ ఫోన్ తీసుకున్నందుకు పాత ఫోన్ ధ్వంసం చేశానని సిసోడియా చెప్పారని, కానీ 3 నెలల్లో ఐఫోన్ కొత్త మోడల్ ఏదీ రాలేదని, అదే మోడల్ ఫోన్ మరొకటి కొన్నారని తెలిపారు. చాట్ హిస్టరీ, ఫోన్ మెమరీలో ఉన్న ఫైళ్లను ధ్వంసం చేయడం కోసమే ఫోన్ మార్చి పాతది ధ్వంసం చేశారని వాదించారు. ఒక వ్యక్తి తప్పులు బయటపడేవరకు ఆ వ్యక్తిని రుషి పుంగవుడిగానే భావిస్తామని, ఎంత మొత్తంలో ప్రభుత్వం నష్టపోయిందన్నది ఇక్కడ ముఖ్యం కాదని తెలిపారు. పాలసీ ద్వారా కొందరికి ప్రయోజనం కల్పించేలా క్లాజుల మీద క్లాజులు రూపొందించారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణలోగా తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది.