వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇవ్వాల చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది న్యూజిలాండ్ జట్టు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టానికి 42.5వ ఓవర్‌లోనే ఛేదించింది.
గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన విలియమ్ సన్ 78 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. డారిల్ మిచెల్ (89 నాటౌట్; 67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో డేవాన్ కాన్వే 45 పరుగులతో రాణించాడు. ఇక, బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతక ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ 66 పరుగులతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా షకీబ్ (40), మహ్మదుల్లా (41), హసన్ మిరాజ్ (30) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.