అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో డ్రగ్స్ డంపింగ్ కలకలం రేపుతోంది . ఇప్పటికే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్ధానంలో ఉందంటూ ఇటీవల పార్లమెంటు సాక్షిగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ ప్రకటించిన నేపధ్యంలో విశాఖలో తాజాగా భారీగా పట్టుబడిన డ్రగ్స్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. స్మగ్లర్లు రానున్న నూతన సంవత ్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో డ్ర గ్స్ చలామణి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న నలుగురు యువకులను ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలు మన దేశంలో కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఢిల్లీ, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గోవా, హైదరాబాద్ ఇలా మహానగరాల్లో అర్ధరాత్రి వేళ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత కేరింతల నడుమ సెలబ్రేషన్స్ ఆకాశానంటే రీతిలో జరుపుతారు. అయితే నూతన సంవత్సర వేడుల్లో మద్యం ఏరులై పారుతుంది. కొన్ని చోట్ల రాత్రి 1 గంట వరకు క్లబ్‌లు, పబ్‌లకు నిబంధనల నడుమ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని నగరాలు, పట్టణాల్లో మాత్రం నియమాలు కఠినంగా అమల్లో ఉంటాయి. మద్యం మత్తులో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున పోలీసుశాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తుంది. అయినప్పటికీ యువత మద్యం, డ్రగ్స్ వినియోగంలో తెగ్గేదేలే అన్నట్లు విచ్చలవిడిగా చిందులు తొక్కడం పరిపాటి. ఈసారి కూడ నూతన సంవత్సర వేడుకలకు మరి కొద్ది రోజులే ఉన్నందున సెల్రబేషన్స్ జరుపుకునేందుకు ఇప్పటికే ఆయా వర్గాలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరి పనిలో వారు అన్న రీతిలో డ్రగ్స్ ప్రియులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సమకూర్చుకుంటున్నట్లు పోలీసులకు ఉన్న సమాచారం.
ఈ సారి మన రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళే పని లేకుండా రాష్ట్రానికే స్మగ్లర్లు భారీగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ ఏడాది డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు గణనీయంగా నమోదు కావడం గమనార్హం. విజయవాడ, విశాఖ, గుంటూరు ఇతర పట్టణాల్లో డ్రగ్స్ వినియోగం తరచూ వెలుగు చూస్తున్నాయి. విజయవాడ, గుంటూరు కేంద్రంగా బెంగళూరు నుంచి విదేశాలకు మాదక ద్రవ్యాలు ఎగుమతి, దిగుమతులు అయిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు విశాఖ నుంచి డ్రగ్స్ సరఫరాలో లింకులున్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లో నార్కోటిక్ వింగ్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.
దీంతో స్మగ్లర్లు రూటు మార్చి విశాఖపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. పట్టు-బడ్డ వారిలో రాజకీయాలతో ప్రమేయం ఉన్న ఓ వ్యక్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విశాఖలో విక్రయిస్తుండగా పోలీసులకు సమాచారం అందడటంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఈ ఆపరేషన్ షురూ చేసింది. బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ సమీపంలో ముఠా డ్రగ్స్ విక్రయిస్తుండగా నిఘా వేసి పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు ఆరు లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు క్రిస్టల్ మేడ్ ఎం డ్రగ్స్‌గా గుర్తించారు. డ్రగ్స్ స్పటిక రూపంలో దొరకడం కొత్త ప్రయోగం. గత ఏప్రిల్‌లో కూడా పోలీసులు స్పటికం పోలిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. విశాఖ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ ్స దొరకడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో యువతే లక్ష్యంగా డ్రగ్స్ చలామణిలో ఉన్నట్లు సమాచారం రావడంతో ముఠాలను గుర్తించేందుకు పోలీసుశాఖ జల్లెడ పడుతోంది. అదేవిధంగా విశాఖ, విజయవాడతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాల్లో కూడా డ్రగ్స్ మూలాలను గుర్తిం చేందుకు స్పెషల్ ఆపరేషన్ షురూ చేసింది.