హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని పది యూనివర్శిటీలకు కొత్త వీసీలు జూన్‌లో రానున్నారు. మే నెల 24తో ప్రస్తుత యూనివర్శిటీ వీసీల పదవీ కాలం ముగియనుంది. ఎన్నికల కోడ్ రావడంతో కొత్త వీసీల నియామకాల ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యేలా కనబడుతోంది. ప్రభుత్వం మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని వీసీల నియామక ప్రక్రియను చేపట్టాలని యోచిస్తోంది.
ఎన్నికల సంఘం అనుమతినిస్తేగానీ మే 24వ తేదీకి ముందే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ వీసీల నియామక ప్రక్రియ మాత్రం ఆలస్యమైతే కొత్త వీసీలు వచ్చే వరకూ ఇంఛార్జీలను నియమించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న యూనివర్శిటీ వీసీలు మాత్రం తమనే ఇంకా కొన్ని నెలలు కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త వీసీల నియామకాల కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని పది వర్శిటీలకు కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను కూడా ఇప్పటికే స్వీకరించింది. అన్ని వర్శిటీలకు కలిపి మొత్తం 1500 వరకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఓ జాబితాను కూడా అధికారులు రూపిందించారు.
ఈ జాబితాను సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హుల పేర్లను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ కమిటీల గడువు ముగియడంతో కొత్త ఈసీలను నియమించి ఆతర్వాత సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వీసీల నియామకం జరపాలంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవడం లేదా కోడ్ ముగిసిన తర్వాతే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. ఇదంతా ముగిసేసి వర్శిటీలకు కొత్త వీసీలు రావాలంటే జూన్ లేదా జూలై మొదటి వారం వరకు ఆగాల్సిందే.