పారిస్ : ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్‌లో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త కరోనా వేరియంట్ రకాన్ని ఫ్రెంచ్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇది కామెరూనియన్ మూలానికి చెందినదిగా శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్‌కు తాత్కాలికంగా ఐహెచ్‌యూ అని పేరు పెట్టారు. ఇది కరోనా బీ.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ బారిన 12 మంది పడినట్టు తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ఐహెచ్‌యూలో 46 కొత్త మ్యూటేషన్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సరికొత్త వేరియంట్ మొదట డిసెంబర్ 10న వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికీ దీనిని పరిశోధనలో ఉన్న వేరియంట్‌గా గుర్తించలేదు. ఈ ఐహెచ్‌యూ వేరియంట్ ముప్పు ఒమిక్రాన్ కంటే అధికమని.. వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ఆఫ్రికాలోనే పుట్టుక..
కొత్త వేరియంట్‌లో 46 మ్యూటేషన్లు, 37 డిలీషన్లు జరిగినట్టు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని వివరించారు. ఇలాంటివి అన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వేరియంట్ విస్తృతి, గతంలో వచ్చిన ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్ మాదిరిగా ఆందోళనకర వేరియంట్‌గా పరిగణిస్తారని చెప్పారు. ఫ్రాన్స్‌లోని మార్సిల్లెస్ నగరంలో 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్ బయటపడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ఎంత వరకు ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital