హైదరాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్త రైలు మార్గాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న కొత్త రైలు మార్గాలను త్వరగా పూర్తి చేయడంతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లను అనుసంధానించడంపై ద.మ.రై.అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్-కర్నాటకలోకి మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే మార్గానికి సంబంధించి రాష్ట్రంలో పనులు పూర్తి కావడంతో ద.మ.రై. ఈ మార్గాన్ని ప్రారంభించింది. అలాగే, కాచిగూడ-కర్నూలు, సికింద్రాబాద్-వాడీ మార్గాన్ని అనుసంధానించింది. దీంతో ఈ రెండు మార్గాలకు కొత్త ప్రత్యామ్నాయం ఏర్పాటైంది. తాజాగా, ఈ మార్గాన్ని ప్రారంభించిన ద.మ.రై. ఈ మార్గంలో ముందుగా గూడ్సు రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ మార్గంలో ఇంకా విద్యుదీకరణ పనులు పూర్తి కాకపోవడంతో ఆ పనులను కూడా పూర్తి చేసి సెప్టెంబర్‌లో ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రారంభించాలని ద.మ.రై.ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కాగా, కర్నూలు మార్గంలో బెంగళూరు వైపు, వాడీ మార్గంలో వెళ్లే గూడ్సు రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించడం ద్వారా వాటి ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ప్రధాన మార్గాలలో అధిక ట్రాఫిక్‌తో ప్యాసింజర్ రైళ్లకు ఎదరువుతున్న ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
దీంతో కొత్త మార్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా, మహబూబ్‌నగర్-మునీరాబాద్ మార్గంలో నిర్మాణ పనులను రూ.3543 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఇందులో తెలంగాణలో దేవరకద్ర నుంచి కర్నాటక సరిహద్దులోని కృష్ణా మధ్య 66 కి.మీ.ల నిడివిని రూ.943 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో దేవరకద్ర వద్ద కర్నూల్ లైన్‌తో అనుసంధానమైంది. దీంతో కర్నూలు, వాడి మీదుగా వెళ్లాల్సిన రైళ్లు మహబూబ్‌నగర్-మునీరాబాద్ మార్గం మీదుగా నడిపేందుకు వీలు కలిగింది. కాగా, మహబూబ్‌నగర్-మునీరాబాద్ మార్గం అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లి, గోవా తదితర ప్రాంతాలకు ప్రయాణికులు తక్కువ సమయంలో వెళ్లే వీలు కలుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి,సిమెంట్ తదితర పరిశ్రమలకు సరుకు రవాణా చేసే రైళ్లకు ఇది ముఖ్య మార్గంగా మారనుంది.