ప్రస్తుతం చదివే కోర్సుకు చేసే ఉద్యోగానికి ఏమాత్రం సంబందం లేకుండా పోతోంది. ఏదోక డిగ్రీ కోర్సు పూర్తి చేయడం.. దానికి సంబందం లేని, దొరికిన చిన్న చితకా ఉద్యోగాన్ని చాలా మంది చేసేస్తున్నారు. ఈ విధానం కొన్నేళ్లుగా నడుస్తోంది. అయితే ఇక మీదట విద్యార్థులు ఏకోర్సు పడితే ఆ కోర్సు చేసి ఏదోక ఉద్యోగం చేయకుండా పలాన కోర్సులో డిగ్రీ పట్టా పొందితే ఆ చదువుకి తగిన మంచి ఉద్యోగం లభిస్తుందనే భరోసాను కల్పించే విధంగా, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టిసారించింది. ఇందులో భాగంగానే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం సిలబస్‌ను సమీక్షించి సిలబస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు బ్రిలీష్ కౌన్సిల్ సహకారంతో యునైటెడ్ కింగ్డమ్‌లోని బంగర్ యూనివర్సిటీ, అబరిస్ట్ విత్ యూనివర్సిటీలు, తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు సమిష్టిగా కరికులం (పాఠ్యప్రణాళిక) డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టాయి. మాసాబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆ నాలుగు వర్సిటీల వైస్ ఛాన్సలర్‌లు, ప్రొఫెసర్లతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి ఈమేరు వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం డిగ్రీ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో అన్ని కోర్సులలో కలిపి మొత్తంగా 2.5 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు వివిధ డిగ్రీ కోర్సులలో చేరారు. ఒక్క కామర్స్ సబ్జెక్టు కోర్సులోనే లక్ష మంది విద్యార్థులు చేరారు. ఇందులో పాస్ అవుతున్న వారు సుమారు 70 వేల మంది వరకు ఉంటున్నారు. ఇందులోనూ బయటికి వెళ్లి తమ కోర్సుకు తగిన విధంగా ఉద్యోగం సంపాధించే నైపుణ్యం కలిగినవారు కొందరే ఉంటున్నారు. మిగతా పాసైన విద్యార్థులంతా ఇక చేసేదిలేక ఏదోక ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. దీని ప్రభావం వారి భవిష్యత్ మీద పడే అవకాశం లేక పోలేదు. దీంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ముందస్తుగా డిగ్రీ సాంప్రదాయ కోర్సులైనటువంటి బీఏ, బీకాం కోర్సుల్లోని పాఠ్యప్రణాళికను ఉద్యోగవకాశాలు విరివిగా లభించే విధంగా మార్పులు చేయబోతోంది. అందుకు విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టులలో విషయ పరిజ్ఞానాన్ని ఉన్నత విద్యా లక్షణాలను, ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేలా సిలబస్ (పాఠ్య ప్రణాళిక)ను తయారు చేయ నున్నారు. దానికనుగుణంగానే యూకేలోని రెండు వర్సిటీలు, తెలంగాణలోని ఓయూ, కేయూ వర్సిటీలు సంయుక్తంగా సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టును 2023 మే వరకు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకొని వచ్చే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ఉన్నత విద్యా మండలి కృషి చేస్తోంది.
పేరుకే డిగ్రీలు…ఉద్యోగాలు నిల్….
ఏటా కుప్పలు తెప్పలుగా డిగ్రీ సాంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. పేరుకే డిగ్రీలు కానీ ఉద్యోగాల వేటలో గ్రాడ్యుయేట్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చదివిన కోర్సును వదిలేసి ఇతర సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలు నేర్చుకొని ఉద్యోగ వెతుకులాటలు చేస్తున్నారు. బీకాం కంటే బీఏది పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఒకప్పుడు దేశంలోనే బీఏ కోర్సు టాప్‌గా ఉండేది. ఉస్మానియాలో బీఏ కోర్సు పూర్తి చేసుకుంటే ఆ గ్రాడ్యుయేట్ పేరు చివరన డిగ్రీ పక్కన బీఏ ఉస్మానియా యూనివర్సిటీ అని రాసుకునే వారని అధికారులు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యా మండలి నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింది. ముందస్తుగా కోత్త సిలబస్‌తో తీసుకొస్తున్న బీఏ, బీకాం కోర్సులను కోర్సులను ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో అందుబాటులోకి తేనుంది.
ఉపాధి అవకాశాలు దొరికేలా సిలబస్..
ప్రొ.ఆర్.లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్
తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంలో భాగంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను, ఉపాధి అవకాశాలు లభించేలా, ప్రపంచ స్థాయి పోటీకి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్ధడం కోసం ఉన్నత విద్యామండలి కృషి చేస్తోంది. కోర్సు పూర్తి చేసుకొని కళాశాల నుండి బయటికి వేళ్లే విద్యార్థి తనకు మంచి ఉద్యోగం లభిస్తుందనే ధీమాతో వెళ్లేలా సిలబస్‌ను రూపొందిస్తున్నాం. తన అర్హతకు, నైపుణ్యానికి తగిన ఉద్యోగం పొందేలా విద్యార్థులను తీర్చిదిద్ధి పంపించే ప్రయత్నాన్ని మొదలు పెట్టాం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital