Saturday, November 23, 2024

IND vs SL | శ్రీలంక‌తో అమీతుమీ.. గెలిచేందుకు స‌రికొత్త వ్యూహాలు

భారత్-శ్రీలంక తలపడిన గత రెండు మ్యాచ్‌లు టైగా మారడం గమనార్హం. ఓడిపోయే మ్యాచ్‌లో గొప్పగా పోరాడి మూడో టీ20ను టీమిండియా టైగా ముగించింది. ఇక సులువుగా గెలిచే తొలి వన్డేలో మాత్రం తడబడి ప్రత్యర్థితో విజయాన్ని పంచుకుంది. అయితే తొలి వన్డేలో చేజారిన గెలుపును రెండో వన్డేలో దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.

మరోవైపు ఈ పర్యటనలో తొలిసారి భారత్ విజయాన్ని అడ్డుకున్న ఆతిథ్య జట్టు శ్రీలంక అదే ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగానే నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2.30 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే స్లో పిచ్‌కు తగ్గట్లుగా తుది జట్టు కూర్పును సిద్ధం చేయాలని భారత్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. జింబాబ్వే పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల పరాగ్‌ ఆరు టీ20లు ఆడాడు. అయితే ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ మాత్రమే తుదిజట్టులో కొనసాగుతుండటంతో బ్యాకప్ పేసర్‌గా దూబెకు తొలి వన్డేలో అవకాశం ఇచ్చారు.

కానీ కొలంబో పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తోంది. తొలి వన్డేలో డెత్ ఓవర్లలో కూడా లంక స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. దీంతో దూబె స్థానంలో పరాగ్‌ను తీసుకోవాలని భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. తొలి వన్డేలో ఆడిన తుదిజట్టుతోనే రెండో వన్డేలో బరిలోకి దిగే ప్లాన్-బీ కూడా ఉంది. ఈ క్రమంలో రిషభ్ పంత్, హర్షిత్ రాణా,ఖలీల్ అహ్మద్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

శ్రీలంకతో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)

- Advertisement -

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్/శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement