సరిహద్దు జిల్లాల్లో చెకపోేస్టులు
కోవిడ్ టెస్టు కేంద్రాలు ఏర్పాటు
మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్ మహానగరంలోనూ ఆందోళన
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ కరోనా పరీక్షలు
అత్యవసరమైతే తప్ప పొరుగు రాష్ట్రాలకు వెళ్లొద్దు : డీహెచ్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు
హైదరాబాద్, పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ ఆ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. పుణ, మహారాష్ట్రతోపాటు విదర్భ ప్రాంతాల్లోనూ వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. దీంతో ఆ ప్రభావం సరిహద్దు జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ కనిపిస్తోంది. వారం క్రితం వరకు ఒక అంకె లేదా సున్నాకు పరిమితమైన రోజువారీ పాజిటివ్ కేసులు ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెరిగాయి. ప్రతి రోజూ 10 నుంచి 20వరకు కొత్త కరోనా కేసులు నమోదవుతున్నట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వాసులకు విస్తృత సంబంధాలు ఉండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి నిత్యం మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతుంటాయి. మహారాష్ట్ర, కర్ణాకటల్లో వ్యాపిస్తోంది కొత్త రకం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్..? లేదంటే ఎన్440కే, ఈ440కే వైరస్ అనేది తేలకపోయినా… ఇవన్నీ కొత్త వైరస్‌లు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్రకు వెళ్లి వచ్చిన వారికి క్వారంటైన్
మహారాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాపి స్తుండడంతో… రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి ఆది లాబాద్, నిజామాబాద్ జిల్లాలు మహా రాష్ట్రతో సరిహద్దును కలిగి ఉండగా… మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూ బ్‌నగర్ జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తత కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని నిజామాబాద్ జిల్లా వైద్యాధికారులు నిర్ణయించారు. జిల్లా వాసులు ఎవరైనా మహారాష్ట్రకు వెళ్లొస్తే తప్పనిసరిగా క్వారంటైన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాలోని సాలూరా, సలాభత్‌పూర్ చెక్ పోస్టుల దగ్గర కరోనా నిర్ధారణా పరీక్షలు కొనసాగుతున్నాయి. సాలూరా, మద్నూరు మండలాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కరోనా నిర్ధారణా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలితే వెనక్కి పంపేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ పాజిటివ్ కేసుల పెరుగుదల
దక్షిణాదిలోని మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుండడంతో గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దీంతోపాటు వారు నిత్యం రైళ్లు, బస్సులు, ప్రయివేటు, సొంత వాహనాల్లో ఆయా రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుం టారు. దీంతో వారి ద్వారా హైదరాబాద్ మహానగరంలోనూ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ కరోనా టెస్టులు చేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాక సన్నద్ధమవుతోంది.
కాగా అత్యవసరమైతేనే తప్ప పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జలుబు, జ్వరం వంటి అనుమానాదాస్పద లక్షణాలు ఉంటే స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దని హెచ్చరించారు.