అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఇంటర్మీడియట్లో డిమాండ్ లేని ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చూడాలని మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల కార్యకలాపాలపై సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో నాగార్జున పలు అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఇంటర్ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఇసి సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఎంఇసి కోర్సుల స్థానంలో విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు జాబ్ గ్యారెంటీ ఇచ్చే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గురుకులాల్లో మొత్తం 1.17 లక్షల సీట్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 1.09 లక్షల సీట్లు భర్తీ కావడం జరిగిందని చెప్పారు. ఖాళీగా మిగిలిపోయిన సీట్లలో ఎక్కువగా ఇంటర్మీడియట్కు చెందిన సీట్లే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడానికి అమలు చేస్తున్న విధానాలపై ప్రిన్సిపాళ్లు, డీసీఓలు దృష్టి పెట్టేలా చూడాలని మంత్రి సూచించారు.
ఈ నేపథ్యంలోనే విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. బాగా చదివి మంచి మార్కులు సాధించే విద్యార్థులకు తరగతుల స్థాయిలో ప్రోత్సాహక బహుమతులను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 189 గురుకులాల్లో 181 గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 8 గురుకులాలకు సంబంధించిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించగా కొత్త భవనాల నిర్మాణాలను శీఘ్రగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో శిధిలావస్థకు చేరినట్లుగా గుర్తించిన మరో 13 భవనాల నిర్మాణాన్ని కూడా వచ్చే ఏడాది చేపట్టాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్ -టైం టీ-చర్ల వేతనాలను సవరించే విషయాన్ని రాబోయే బీఓజీ సమావేశంలో పెట్టి తీర్మానించాలని మంత్రి కోరారు. గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను, కేర్ టేకర్లు, లైబ్రేరియన్ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, క్యాంపస్ క్లీనింగ్ కోసం చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ తదితర కార్యక్రమాలను మంత్రి సమీక్షించి సూచనలు చేసారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, ఎఎంఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.