Thursday, November 21, 2024

ఎస్సీ ఎస్టీ నిరుద్యోగుల‌కు రూ.5 ల‌క్ష‌లు ఉపాథి స్కీమ్..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం….
నిరుద్యోగుల మేలుకు భారీ పథకం
ఏప్రిల్‌ 1 నుండి అమలుకు యోచన
ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయింపు

హైదరాబాద్‌, : కొత్త పథకాలను రూపొందించడంలో, అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీతనం.. సమస్య మూలాల్లోకి వెళ్లి చికిత్సచేసే సమగ్రత స్పష్టంగా కనబడుతుంది. కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి ఎన్నో సూపర్‌హిట్‌ పథకాలు, దేశమంతా అనుసరించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇపుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులను ఆదుకునేందుకు, ఆర్థిక స్వాలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు భారీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈనెల 18న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో.. ఈ పథకానికి భారీనిధులు కేటాయించనుండగా, ఏప్రిల్‌ 1 నుండే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రచారం సంద ర్భంగా.. మంత్రులు, నేతలు ఈ పథకానికి సంబంధించిన సంకేతాలిస్తుండగా, ప్రభుత్వ పరంగానూ విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.
నిరుద్యోగులు.. వెనుకబడ్డ వర్గాలే లక్ష్యం
నిరుద్యోగులు, వెనుకబడ్డ వర్గాల మేలే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. గతంలో పలు ప్రభుత్వాలు అమలుచేసిన స్వయం ఉపాధి పథకాల్లా కాకుండా.. నేరుగా లబ్ధిదారుడైన యువకుడు, యువతికి లబ్ధి జరిగేలా.. స్వయం ఉపాధి పొందేలా ఈ పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ యువత ఆర్థిక అభ్యున్నతికి.. ఈ పథకం దోహదపడేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దళిత కుటుంబాల ఉపాధికి పలు పథకాలను రూపొందించిన ప్రభుత్వం సీఎం ఎస్సీ ఎంపవర్‌మెంట్‌ స్కీం రూపొందిం చనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా దీనిని ప్రక టించారు. దళితులతో పాటు గిరిజన, బలహీనవర్గాల యు వత ఉపాధి వికాసం కోసం రూపొందిస్తున్న కొత్త పథకం లో.. ఇది కూడా భాగమయ్యే అవకాశాలున్నాయి. దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాల ఉపాధి అవకాశాల మెరుగు, అభివృద్ధి కోసం రూ.పది వేల కోట్లయినా వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.50 వేల కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఉందని, దళిత, గిరిజన బిడ్డల వికాసానికి.. అవసరమైతే రానున్న కాలంలో ఆ మొత్తం వెచ్చించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించమని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది.
ఇటీవల కాలంలో ప్రధానంగా ఎస్సీల వెనుకబాటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేవలం పథకం ప్రకటించి నిధులు మంజూరు చేయడం కాకుండగా, ఆ నిధులు సద్వినియోగం చేసుకుని జీవితా నికి భరోసా ఏర్పరుచుకునేలా, ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసరించేలా మార్గదర్శకాలు ఉండాలని.. అధికార యంత్రాంగానికి నిర్దేశించినట్లు తెలిసింది.
ఉపాధి.. ఉద్యోగం
నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వరుస నోటిఫికేషన్లకు ఆదేశాలిచ్చింది. ఆయా శాఖలు ఇప్పటికే ఖాళీలు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించాయి. ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం అందించే పథకంతో పాటు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరు గుపరిచే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే సింగరేణి నోటిఫికేషన్లు మొదలుపెట్టగా, పోలీసుశాఖ, ఇతర శాఖలకు ఇందుకు సంబంధించిన లాంఛనాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. ఉద్యోగాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో భర్తీచేసినా, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో దుష్ప్ర చారం జరుగుతోందని.. దీనికి చెక్‌ చెప్పేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement