సాయుధ దళాల్లో కొత్తవారిని చేర్చుకునేందుకు (రిక్రూట్‌మెంట్‌కు) కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం.కేంద్రం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ చారిత్రాత్మకమైనదే. అంతేకాదు, త్రివిధ దళాల్లో విప్లవాత్మక మైన మార్పులకు ఇది నాంది అవుతుంది. ప్రభుత్వోద్యోగాల్లో ప్రవేశానికి ముందు త్రివిధ దళాల్లో తప్పని సరిగా కొన్నాళ్ళ పాటు పని చేయాలన్న నిబంధన వల్ల ప్రభుత్వ శాఖలలోకి క్రమశిక్షణ, సత్ప్రవర్తన కలిగిన ఉద్యోగుల ఎంపిక సులభతరం అవుతుంది.అంతేకాక, ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం, నిబద్ధత కలిగిన వారిని ఎంపికచేసినట్టు అవుతుంది.ఈ పథకం కిందమొదటి జట్టులో 45వేల మందిని ఎంపిక చేస్తారట.17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులైన వారిని ఈ పథకం కింద ఎంపిక చేస్తారని కేంద్రం విడుదల చేసిన ప్రకటన తెలియజేస్తోంది.ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీ తనం లేకపోవడం వల్ల ప్రజల అవస్థల గురించి ప్రధానమంత్రి చాలా సందర్బాల్లో ముఖ్యంగా, ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి నెలా మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో సార్లు ప్రస్తావించారు.ఈ సమస్య గురించి ప్రధానమంత్రికి కూలంకషంగా తెలియడం వల్లనే, ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్ మెంట్‌కు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఉంటారు.అంతేకాక,తమ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న మాటను దీని ద్వారా నిలబెట్టుకున్నట్టు అవుతుందని ప్రధాని భావించి ఉంటారు.త్రివిధ దళాల్లో యువతను ఎంపిక చేయడం నిరంతరం కొనసాగే ప్రక్రియ.ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే యువకులకు కఠినమైన శిక్షణ ఇస్తారు.పర్వతాలను అధిరోహించడం,కారడవుల్లో సంచరించడం,అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడూ,వరదల సమయంలోనూ సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తగిన శిక్షణ ఇస్తారు.ఈ పథకం కింద ఎంపిక అయ్యే యువకులను అగ్నివీర్‌లని పిలుస్తారు.పేరు తగినట్టుగానే వీరు అగ్నివీరుల్లానే పని చేస్తారు.వీరి ఎంపిక ఆన్‌లైన్ ద్వారాకేంద్రీకృత విధానం ద్వారా జరుగుతుంది.ఈ పథకం కింద ఎంపిక అయ్యేవారు ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.పూర్తిగా శక్తి సామర్ధ్యాలు,ప్రతిభను బట్టే ఎంపిక చేస్తారు.వీరికి నెలనెలా 30 నుంచి 40 వేల వేతనాలను చెల్లిస్తారు. త్రివిధ దళాల్లో శిక్షణ పొందడం వల్ల సర్వీసులో ఉన్నవారికి దేశ భక్తి,జాతీయ భావాలుఅలవడతాయి. అగ్నివీరుల్లో 25 శాతం మందిని రక్షణ శాఖలోనే కొనసాగిస్తారు.వారిని రక్షణ శాఖలో మామూలు ఉద్యోగాల్లో పదిహేను సంవత్సరాలు పనిచేసిన తర్వాత యోగ్యతా పత్రాలు ఇస్తారు.ప్రభుత్వోద్యోగాల్లో ఎంపికలో వీరికి ప్రాధాన్యం ఉంటుంది.సుశిక్షితలైన సైనికుల వలె అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం.ఇలా ఎంపిక అయినవారు నిజంగానే సుశిక్షితులైన సైనికులే.అగ్నిపథ్
పథకం కింద యువకుల ఎంపిక కార్యక్రమం 90 రోజుల్లో ప్రారంభమవుతుంది.ఈ పథకంలో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ వచ్చే ఏడాది జూలైకి సిద్ధమవుతుంది.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశలకుతగినట్టుగా ఈ పథకాన్ని రూపొందించారు.ఈ
పథకం విజయవంతం అయితే, త్రివిధ దళాల్లో ప్రభుత్వం పెట్టే ఖర్చు బాగా తగ్గవచ్చు.అంటే 5.2 కోట్ల వరకూ తగ్గవచ్చు. ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగుల ఎంపికకు ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతుంది.ఈ పథకం కింద రక్షణోద్యోగుల ఎంపిక మామూలు రిక్రూట్ మెంట్ మాదిరిగానే ఉంటుంది.అయితే, ఈ కొత్త పథకం అమలులోకి రాకుండానే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పథకం కింద ఎంపిక అయ్యేవారు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరన్న విమర్శలు వచ్చాయి.రక్షణోద్యోగుల్లో పోరాట స్ఫూర్తిపై దీని ప్రభావం ఉంటుందని విమర్శకులు పేర్కొంటున్నారు.నాలుగు సంవత్సరాల కాలపరిమితి అనగానే ఈపథకం కింద ఎంపికయ్యేవారిలో అంకిత భావం ఉండకపోవచ్చన్న విమర్శలు వచ్చాయి. అయితే, త్రివిధ దళాలలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రధానమంత్రిచేస్తున్న ప్రయత్నాల్లో ఈ పథకం ఒక ప్రారంభం మాత్రమేననీ, దీని అమలులో ఏర్పడే ఇబ్బందులను తొలగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.ఈ పథకం కింద మహిళలను కూడాఎంపిక చేస్తారు. మహిళలకు అమలు జరిపే పథకానికి అగ్ని పథ్ అని నామకరణం చేశారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ పథకం ఉపయోగ పడుతుంది.దేశానికి ఏ సమయంలోనైనా సేవలందించేందుకు యువతీయువకులను సన్నద్ధం చేయడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.