హైదరాబాద్, ఆంధ్రప్రభ : హజ్-2025 కోసం మక్కా యాత్రకు వెళ్లనున్న హజ్ యాత్రికలకు హజ్ కమిటీ కొత్త నిబంధనలు ఖరారు చేసింది. హజ్ యాత్రలో భాగాంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అరబ్బులోని భారత ఎంబేసీ కేంద్ర హజ్ కమిటీకి పంపింది.
2025లో జరగనున్న హజ్ వచ్చే సంవత్సరం జూలై చివరి లేదా ఆగస్టు తొలి వారంలో రానున్న క్రమంలో యాత్రికుల పాస్‌పోర్టు విషయమై కీలక మార్పులను చేసింది. హజ్ యాత్రికుల పాస్‌పోర్టులో 2026 జనవరి 31 వరకు గల వాలిడిటీతో పాటు మెషిన్ రీడిబిలిటీ ఉండాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియాబాని ఖుస్రో పాషా మీడియాకు వెల్లడించారు.
ఈ 2024 హజ్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి 11,378 యాత్రికులు మక్కాకు వెళ్లగా, వచ్చే ఏడాది ఈ యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా సౌదీ ప్రభుత్వం పాస్‌పోర్టు నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులను గర్తించి రాష్ట్రం నుంచి వెళ్లాలనుకున్న వారు తమతమ పాస్‌పోర్టులను అప్‌డేట్ చేసుకోవాలని బియాబాని సూచించారు.