Saturday, November 23, 2024

RBI | రేప‌టి నుంచి బ్యాంకుల కొత్త రూల్స్…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బిజినెస్ డెస్క్‌: అక్టోబర్ 1వ తేదీ నుంచి పలు బ్యాంకింగ్‌, ట్యాక్స్ రూల్స్‌ మారనున్నాయి. ఇవి వినియోగ‌దారుల‌ పెట్టుబడులపై, బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉంద‌ని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. అందుకే వాటి గురించి త‌ప్ప‌కుండా తెలుసుని ఆర్థిక‌ప‌ర‌మైన వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకోవాల‌ని అంటున్నారు. ఇక‌.. ఫైనాన్స్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెబుతోంది.

స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌

పోస్ట్ ఆఫీస్ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)తో సహా చిన్న పొదుపు ఖాతాలకు సంబంధించిన పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి మీ పొదుపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ రూల్స్

ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం రెండు కొత్త డెబిట్ కార్డ్ బెనిఫిట్స్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, అక్టోబర్ 1 నుంచి ఒక త్రైమాసికంలో రూ.10,000 కనుక ఖర్చు చేస్తే, తరువాతి మూడు నెలల్లో 2కాంప్లిమెంటర్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందవచ్చు. ఉదాహరణకు మీరు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మీ ఐసీఐసీఐ డెబిట్ కార్డ్ ఉపయోగించి రూ.10,000 ఖర్చు చేశారని అనుకుందాం. అప్పుడు అక్టోబర్‌ – డిసెంబర్‌ త్రైమాసికంలో మీరు 2 సార్లు ఉచితంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ యాక్సెస్ పొందవచ్చు.

- Advertisement -

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం, ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే యాపిల్ ప్రొడక్టులు కోసం రివార్డ్ పాయింట్లను రిడీమ్‌ చేసుకోగలుగుతారు. దీనితో పాటు తనిష్క్ వోచర్ల రిడీమ్‌పై కూడా క్యాప్‌ పెట్టింది. అంటే ఇకపై ప్రతి త్రైమాసికంలో 50,000 రివార్డ్ పాయింట్లను మాత్రమే తనిష్క్ వోచర్ల కింద రిడీమ్‌ చేసుకోవడానికి వీలవుతుంది.

టీడీఎస్‌

కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ ప్రభావం నేరుగా స్థిరాస్తి విక్రయాలపై పడనుంది. అక్టోబర్ 1 నుంచి రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని విక్రయిస్తే, పేమెంట్‌పై 1 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ సర్వీస్ ఛార్జీలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) సేవింగ్స్ ఖాతాల సర్వీస్ ఛార్జీల్లో పలు మార్పులు చేసింది. పొదుపు ఖాతాలో కనీస మొత్తం మెయింటైన్ చేయడం, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల జారీ, డూప్లికేటింగ్‌ డాక్యుమెంట్స్‌, లాకర్ రెంటల్‌కు సంబంధించిన ఫీజుల్లో పలు మార్పులు చేసింది.

ఎన్‌ఎస్ఈ, బీఎస్‌ఈ ట్రాన్సాక్షన్‌ ఫీజులు

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు అక్టోబర్ 1 నుంచి ట్రాన్సాక్షన్‌ ఛార్జీల్లో పలు సవరణలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఈ – క్యాష్‌, డెరివేటివ్స్‌ సెగ్మెంట్స్‌ రెండింటిపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బీఎస్‌ఈ తన ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లోని సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌లలో ప్రత్యేకంగా మార్పులు చేసింది.

రిటైల్‌, MSME లోన్స్‌

బ్యాంకులు, అలాగే రుణదాతలు అక్టోబర్ 1 నుంచి కచ్చితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై, రిటైల్‌ లోన్స్‌పై ‘కేఎఫ్‌ఎస్‌’ ఇవ్వాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంటే తాము ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ, రుణ ఒప్పంద నిబంధనల గురించిన పూర్తి వివరాలతో ‘కీలక వాస్తవాల ప్రకటన’ (KFS)ను రుణగ్రహీతలకు అందించాలని ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement