Thursday, November 21, 2024

ముద్దులు.. కౌగిలింతలు వద్దు.. కొవిడ్‌ మహమ్మారి వేళ కొత్త ఆంక్షలు

దేశ ఆర్థిక రాజధాని నగరం షాంఘైలో కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు దిగింది. ఇప్పటికే పౌరుల్ని గృహనిర్బంధానికి ఆదేశించింది. మరొకవైపు ఉద్యోగులు కార్యాలయాల్లోనే ఉండిపోతున్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ఆంక్షలతో విసుగుచెందిన పౌరులు, ప్రభుత్వంపై వివిధ రూపాల్లో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేదిలేదన్న ప్రభుత్వం, డ్రోన్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా హెచ్చరికలను పంపింది. ‘తాము ఎదుర్కొంటోన్న కొరత గురించి షాంఘై ప్రజలు బాల్కనీల్లోకి వచ్చి పాటల రూపంలో నిరసన తెలిపారు.

ఆ వెంటనే ఒక డ్రోన్‌ ప్రత్యక్షమైంది. ‘కొవిడ్‌ నిబంధనలు పాటించండి. స్వేచ్ఛ కోసం మీ మనస్సులో నిండిన కోరికను నియంత్రించుకోండి. కిటికీలు తెరవకండి. పాడకండి’ అంటూ ఓ నెటిజన్‌ డ్రోన్‌ ప్రకటన వీడియోను షేర్‌ చేశారు. అలాగే ఇంకో ట్వీట్‌లో ఆరోగ్య కార్యకర్తల ప్రకటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ‘ఈ రాత్రి నుంచి ఇంట్లో జంటలు వేర్వేరుగా పడుకోవాలి. ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దు. భోజనం కూడా విడిగానే చేయాలి’ అంటూ ప్రకటించడం కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం రోబోలు గస్తీ తిరిగిన వీడియోలు చక్కర్లు కొట్టాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement