Wednesday, November 20, 2024

ధాన్యం సేకరణలో కొత్త రికార్డ్.. 51లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయిందని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పలు బ్యారేజీల వల్ల సాగు, దిగుబడి విస్తీర్ణం గణనీయంగా పెరిగిపోయింది. వానాకాలం దిగుబడి కోటి మెట్రిక్‌ టన్నులు దాటనుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112.34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ఇప్పటి వరకు 8లక్షల 94వేల మంది రైతుల నుంచి 50.95 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీని విలువ రూ.10487.02 కోట్లు- కాగా, ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల మేరకు ఇప్పటి వరకు రూ.8576.51 కోట్లు- జమ చేసింది. అయితే, మొత్తం 6972 కోనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొనుగోలు చాలా చోట్ల ముగియడంతో 3097 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు.

మరి కొన్ని రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో నిజామాబాద్‌ జిల్లా టాప్‌లో నిలిచింది. ఇప్పటివరకు 5,85,857 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు. రెండో స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 4.49.343 మెట్రిక్‌ కన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈసారి కూడా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టాప్‌లో నిలిచింది. అత్యల్పంగా అసిఫాబాద్‌, గద్వాల్‌, అదిలాబాద్‌ జిల్లాలలో ధాన్యం సేకరణ జరిగింది. అసిఫాబాద్‌లో 9,287, గజ్వల్‌లో 8,012, అదిలాబాద్‌లో కేవలం 1395 మెట్రిక్‌ కన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ఈ ఏడాకి నిర్ణయించారు.

- Advertisement -

ఇప్పటి వరకు ఏ గ్రేడ్‌ వైరటీ 46.20 లక్షల మెట్రిక్‌ కన్నులు కొనుగోలు చేశారు, కామన్‌ వైరటీ కింద 3.84 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా ఉంటేనే ఈ ధర చెల్లిస్తారు. కానీ, ప్రైవేట్‌ వ్యాపారులు ఒక పక్క కోతలు నిర్వహిస్తుండగానే మరో పక్క కొనుగోళ్లు చేసుకుని వెళ్లారు. ఈసారి ప్రైవేటు ట్రేడర్లు, మిల్లర్లు 30లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు, దీన్ని బట్టి ఇప్పటవరకు 80 లక్షల మెట్రిక్‌ టన్నులు దాటినట్లేనని అధికారులంటున్నారు.

ధాన్యం సేకరణలో రికార్డు

చరిత్రలో తొలిసారి అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. కోటి 12లక్షల మెట్రిక్‌ కన్నులు సేకరిం చాలని లక్ష్యంగా నిర్ణయించాం, ఇప్పటి వరకు 52లక్షవ మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. తెలంగాణ రాకముందు 2,200 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మేము గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం.. రైతుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి ఆ విధంగానే ముందుకు పోతున్నాం. ప్రతి గింజ కొనుగోలు చేయడంతో కొనుగోలు వేగవంతా జరిగి చివరి దశకు చేరుకుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాం.

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement