Saturday, November 23, 2024

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నాలుగైదు నెలల్లో దశల వారీగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని ఇందుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలను రూపొందించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని పౌర సరఫరాలశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీని ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లి, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరితగతిన అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించింది. తమకు రేషన్‌ కార్డులు కావాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అర్హులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసి మిగతా వారి నుంచి కూడా కార్డుల జారీకి అర్జీలను స్వీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రేషన్‌ కార్డుల జారీకి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాపై మరోసారి పూర్తి నివేదికను తెప్పించి ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కోరినట్టు సమాచారం. ఆగస్టు చివరికల్లా రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన దరఖాస్తులన్నింటినీ వడపోసి మిగతా ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కలెక్టర్లకు మౌకిక ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వనీయవర్గాలు చెబుతున్నాయి.

రద్దయిన కార్డుల స్థానంలో కొత్త కార్డులు..

వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్‌ కార్డులను కూడా పునరుద్ధరించాలన్న నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. తొలగించిన రేషన్‌ కార్డుల వారి నుంచి మరోసారి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించాలని ఈనెల 20వ తేదీలోగా ఈ దరఖాస్తులను తీసుకునేలా తహసీల్దార్లు స్థానికంగా నోటిఫికేషన్‌ను ఇవ్వాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ కోరినట్టు సమాచారం. 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు లోబడి తెలంగాణలో ప్రభుత్వం అనర్హుల పేరుతో లక్షలాది తెల్ల రేషన్‌ కార్డులను తొలగించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారులకు ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా రేషన్‌ కార్డులను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ గత ఏడాది ఓ వ్యక్తి సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. తెల్ల రేషన్‌ కార్డులను పొందేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అకారణంగా కార్డులను రద్దు చేశారని వీటి పునరుద్ధరణకు సత్వరమే చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోత్తమ న్యాయస్థానం ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రద్దు చేసిన రేషన్‌ కార్డులపై పున:పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. కార్డులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని కోరింది. ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన తెల్లరేషన్‌ కార్డుల స్థానంలో కొత్త రేషన్‌ కార్డులను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. తిరిగి రేషన్‌ కార్డుల జారీకి దరఖాస్తులను ఆహ్వానించాలని భావిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చింది. ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించాలని వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక కొత్త వాటి జారీకి మార్గదర్శకాలను రూపొందించాలని కోరినట్టు సమాచారం. తెల్ల రేషన్‌ కార్డుల జారీలో జాగురూకతతో వ్యవహరించాలని ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ముందే నియమ నిబంధనలు రూపొందించి అందుకు లోబడి దరఖాస్తు చేసుకునే వారికి కార్డులు ఇచ్చేలా చూడాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ ఆయా జిల్లాల అధికారులను కోరినట్టు సమాచారం.

కొత్తగా పది లక్షల కార్డులు..

రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల స్థానంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం తొలి విడతగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పది లక్షల కార్డులను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2016లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి 5.5 లక్షల రేషన్‌ కార్డులను వెనక్కి తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా మరో 4.5 లక్షల కార్డుల జారీకి శ్రీకారం చుట్టే వీలుందని పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చాలా మందికి ఒకటికి మించి రేషన్‌ కార్డులు ఉన్నట్టు అధికారులు నిర్వహించిన ఒక సర్వేలో తేలినట్టు సమాచారం. అటువంటి వారు ఎక్కడో ఒకచోట తమ రేషన్‌ కార్డులను కొనసాగించి రెండో కార్డును రద్దు చేసుకోవాలని లేని పక్షంలో రెండింటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ తరహా కార్డులు దాదాపు లక్షకుపైగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో రేషన్‌ కార్డు తీసుకున్న వ్యక్తి తన స్వగ్రామంలో కూడా కార్డును కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement